TCS Nashik Case: భారత్‌లో అతి పెద్ద ఐటీ సేవల సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ నాసిక్ యూనిట్‌లో వెలుగులోకి వచ్చిన ఘటనలు కార్పొరేట్‌ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ కేసులో లైంగిక వేధింపులతోపాటు వ్యవస్థీకృత మతమార్పిడి ముఠా కార్యకలాపాలు సాగిస్తోందనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాసిక్ పోలీసులు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిడా ఖాన్ గురించి వస్తున్న సమాచారం మరింత చర్చనీయాంశమవుతోంది. 

Continues below advertisement

నాలుగేళ్ల నుంచి నరకం

నాసిక్‌లోని టీసీఎస్‌ బీపీవో యూనిట్‌లో పని చేసే 8 మంది మహిళా ఉద్యోగులు తమపై జరుగుతున్న అకృత్యాల గురించి పోలీసులను ఆశ్రయించడంతో భారీ విషయం వెలుగులోకి వచ్చింది. 2022 ఫిబ్రవరి నుంచి 2026 మార్చి మధ్య కాలంలో తమను మానసికంగా, శారీరకంగా వేధించడమే కాకుండా, మతం మారాలని ఒత్తిడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. వారంతా కంపెనీ ఉద్యోగులుగా మారువేషాల్లో వెళ్లి బ్రేక్‌త్రూ సాధించారు. దీంతో సిట్ ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 9 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. ఇందులో ఒక మేల్ ఎంప్లాయ్‌ తనను మతపరంగా వేధించారని, మతం మారాలని ఒత్తిడి చేశారని చెప్పారు. 

సమాంతర వ్యవస్థ ఏర్పాటు చేసిన కేటుగాళ్లు

కంపెనీ కార్యాలయంలోనే నిందితులు ఒక సమాంతర వ్యవస్థను నడుపుతున్నట్టు మాజీ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. ఈ వ్యవస్థ ద్వారా మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురి చేసేవారిని ఆమె తెలిపారు. భద్రతా కారణాల పేరుతో ఉద్యోగుల ఫోన్‌లు, బ్యాగులు, లంచ్‌ బాక్స్‌లను కూడా ఆఫీస్‌ ఫ్లోర్‌ వెలుపలే ఉంచాలని నిబంధనలు విధించేవారని, దీని వల్ల లోపల జరిగే అక్రమాలు ఎక్కడా రికార్డు కాకుండా చూసుకునే వారని ఆమె ఆరోపించారు. టీమ్‌ లీడర్లు తమ డెస్క్‌ల వద్ద మహిళలను పిలిచి అసభ్యకరమైన భాషలో మాట్లాడేవారని వృత్తిపరమైన వాతావరణానికి విరుద్ధంగా ప్రవర్తించేవారని బాధితులు వాపోయారు. 

Continues below advertisement

లైంగిక వేధింపులు- హోటల్స్ బుకింగ్స్

ఈ కేసులో అరెస్టు అయిన నిందితుల్లో డానిష్, రజా అనే వ్యక్తులు ఆఫీసు నుంచే వారాంతాల్లో హోటళ్లు, రిసార్టులు బుక్ చేసే వారని బాధితులు తెలిపారు. యువ మహిళా ఉద్యోగులు తమతో పాటు ఆ హోటళ్లకు రావాలి ఒత్తిడి చేసేవారని ఆరోపించారు. సీనియర్ మేనేజ్‌మెంట్‌కు తెలియకుండా ఇదంతా ఒక క్రమపద్ధతిలో సాగిందని మాజీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలో ఒక లైంగిక వేధింపుల నెట్‌వర్క్ పని చేస్తోందని బాధితులు చెబుతున్నారు. 

మత మార్పిడి ఆరోపణలు, వేధింపులు 

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న తౌసిఫ్ అత్తార్ మహిళా ఉద్యోగుల హిందూ మత ఆచారాలను లక్ష్యంగా చేసుకునే వాడని ఆరోపణలు వచ్చాయి. పండుగల సమయంలో మహిళలు చీరలు కట్టుకుని లేదా బొట్టుపెట్టుకొని ఆఫీస్‌కు వచ్చినప్పుడు అతను వారిని హేళన చేసేవాడని సాక్షులు చెబుతున్నారు. "నువ్వు ఎందుకు ఈ మతాన్ని ఫాలో అవుతున్నావ్‌? అంటూ తౌసిఫ్‌ నిలదీసేవాడని, కృష్ణ అనే ఒక ఉద్యోగి రుద్రాక్ష మాలను ధరించే వారని,అయితే నిందితుల ఒత్తిడి వల్ల అతను ఇస్లాం మతంలోకి మారినట్టు ఒక మాజీ ఉద్యోగి వెల్లడించారు. హిందూ దేవతలను దూషించడం, బలవంతంగా మాంసాహారం తినిపించం, నిర్దిష్ట మతపరమైన పద్ధతులను పాటించాలని ఒత్తిడిచేయడం వంటి చర్యలను నిందితులు పాల్పడ్డారని ఎఫ్‌ఐఆర్‌లలో పేర్కొన్నారు. 

నిడా ఖాన్ ఎవరు? ఎక్కడ ఉంది?

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా నిందితురాలు నిడా ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉంది. తొలుత ఆమె టీసీఎస్ హెచ్ ఆర్‌ మేనేజర్‌ అని వార్తలు వచ్చినప్పటికీ, తాజా ఆధారాల ప్రకారం ఆమె కేవలం ఒక టెలికాలర్ మాత్రమేనని తెలుస్తోంది. టీసీఎస్‌ నాసిక బీపీఓ యూనిట్‌లో ఆమె ప్రాసెస్‌ అసోసియేట్‌గా పని చసే వారిని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఒక మహిళా ఉద్యోగి తనకు జరిగిన వేధింపులపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు, నిడా ఖాన్ ఆమెను అడ్డుకుని ఇలాంటి జరుగుతూనే ఉంటాయని చెప్పి కేసును తప్పుదారి పట్టించారని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఆమె ప్రస్తుతం పోలీసుల నుంచి తప్పించుకోని తిరుగుతోందని గర్భవతిని అని చెబుతూ కోర్టు నుంచి ఊరట పొందడానికి ప్రయత్నిస్తోందని సమాచారం. 

ఈ కేసులో పోలీసుల ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేశారు. వారిలో డానిష్‌ షేక్‌, తౌసిఫ్‌ అత్తార్‌, రజా మెమన్, షారుఖ్‌ ఖురేషీ, షఫీ షేక్‌, ఆసిఫ్‌ అఫాబ్‌ అన్సారీ, షారుఖ్‌ షేక్ ఉన్నారు. అరెస్టు అయిన వారందరినీ టీసీఎస్‌ యాజమాన్యం తక్షణమే సస్పెండ్ చేసింది. మరో మహిళా ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనలపై సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. మోసపూరిత మత మార్పిడులను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని అడ్వకేట్‌ అశ్విని కుమార్ కోర్టును కోరారు.