Udhayanidhi Stalin: తమిళనాడుపై హిందీ రుద్దాలని చూస్తే మరో భాష యుద్ధం తప్పదు- కేంద్రానికి ఉదయనిధి స్టాలిన్ హెచ్చరిక
ABP Southern Rising Summit | చెన్నైలో జరిగిన సదస్సులో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కోయంబత్తూర్ మెట్రోకు నిరాకరించడం, డిలిమిటేషన్ లపై కేంద్రంపై విమర్శలు చేశారు.

ABP Southern Rising Summit 2025 | చెన్నై: దేశమంతా ద్రావిడియన్ ఆల్‌గారిథమ్ పాటించాలని లేకపోతే రాష్ట్రాలు మరిన్ని చిక్కుల్లో పడతాయని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అన్నారు. జనాభా తక్కువగా ఉన్నారని సాకుగా చెబుతూ కొయంబత్తూర్, మధురై మెట్రో ప్రాజెక్టులను కేంద్రం నిరాకరించిందని.. జనాభా నియంత్రణ పాటించినందుకు ఫలితం ఇదన్నారు. తమిళనాడుపై హిందీనే కాదు మరో భాషను రుద్దాలని చూస్తే మరో భాషా యుద్ధం తప్పదని కేంద్రానికి సంకేతాలు పంపారు.
దేశమంతా డ్రావిడియన్ ఆల్‌గారిథమ్ పాటించాలి..
ఏబీపీ నెట్‌వర్క్ చెన్నైలో నిర్వహించిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిథి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతిష్టాత్మక ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కేంద్రాలకు అధికారాలు పరిమితం అవుతున్నాయి. తమిళనాడు మోడల్ నుంచి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాల్సి ఉందని గతంలోనే చెప్పాను. Dravidian Alagarithm విషయానికి వస్తే.. ఫెడరలిజాన్ని బలపరచడం. ఆల్‌గారిథమ్ అంటే సరైన ఔట్ పుట్ రావడానికి కంప్యూటర్‌కు స్టెప్ బై స్టెప్ సూచనలు ఇస్తాం. అదే విధంగా ఇప్పుడు తమిళనాడులో ద్రవిడియన్ ఆల్‌గారిథమ్ ఫాలో అవుతాం. రాజకీయంగా ఎలా ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వస్తే ఏకమవుతాం. దేశమంతా ఇదే పాటిస్తే ప్రయోజనం.
రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా ఉంటాయి. అంటే అందరికీ హక్కులుంటాయి. కానీ కేంద్రం మాత్రమే తామే సుపీరియర్ అని భావిస్తోంది. మా సీఎం ఎంకే స్టాలిన్ అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని యూనియన్ గవర్నమెంట్ అని పిలుస్తున్నారు. ఇది కేంద్రానికి ఏ మాత్రం నచ్చదని మాకు తెలుసు. రాష్ట్రాల సమూహమే కేంద్రమని డీఎంకే పార్టీ నమ్ముతుంది. ఫెడరల్ సిస్టమ్ ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుంది. తమిళనాడు నుంచి ఎక్కువ పన్నులు వసూలు చేసి తక్కువ మొత్తం రాష్ట్రానికి కేంద్రం నిధుల రూపంలో తిరిగిస్తుంది. తమిళనాడుకు చాలా రంగాల్లో న్యాయం జరగడం లేదు.
డిలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం..
నియోజకవర్గాల పునర్ విభజన ద్వారా జనాభా నియంత్రణ చేయని ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ఎంపీ సీట్లతో వారి అధికారం మరింత పెరిగి దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. భాష విషయంలోనూ ఇక్కడి ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. తమిళనాడు 1960 దశకం నుంచి రెండు భాషల విధానాన్ని పాటిస్తుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో మరో భాషను తమిళనాడు ప్రజలపై రుద్దాలని చూస్తున్నారు. 2 వేల కోట్లు కాదు 10 వేల కోట్లు ఇచ్చినా మూడు భాషల విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం అంగీకరించదని సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రానికి స్పష్టంచేశారు. హిందీనే కాదు మరో భాషను మా ప్రజలపై రుద్దాలని చూస్తే తమిళనాడు పోరాటం కొనసాగిస్తుంది.
కేంద్రంపై గళమొత్తిన తొలి నేత ఎంకే స్టాలిన్..
చారిత్రక విషయాలు, సంస్కృతి, సాంప్రదాయాలను కేంద్రం దాచిపెట్టి, కొన్నింటిని తుడిచిపెట్టి రాష్ట్రాల ప్రభావాన్ని తగ్గించాలని.. పెత్తనం చేయాలని కుట్రలు చేస్తోంది. రాష్ట్రాలను ఆర్థికంగా, రాజకీయంగానూ దెబ్బతీయాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలను పాటించే మున్సిపల్ ఆఫీసులుగా రాష్ట్రాలను మార్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్రం అజెండాను డీఎంకే అడ్డుకుని, తమిళనాడు ప్రజలకు ఉండాలని హక్కులు, నిధులు, న్యాయం, గౌరవం కోసం పోరాడుతుంది. అందుకే కేంద్రంలోని బీజేపీ డీలిమిటేషన్ పై గళం ఎత్తిన తొలి నేత తమిళనాడు సీఎం స్టాలిన్. కుటుంబ నియంత్రణను సరిగ్గా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే, ఎక్కువ జనాభాతో ఎక్కువ ఎంపీ సీట్లతో తమ బలాన్ని పెంచుకోవాలని కేంద్రం కుట్ర చేస్తోందని’ ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.






















