Jallikattu : ముగిసిన సంక్రాంతి సంబురాలు - జల్లికట్టు చివరి రోజు ఆరుగురు మృతి - వందల మందికి గాయాలు
Jallikattu : జల్లికట్టులో, శ్రీలంక తూర్పు ప్రావిన్స్ మాజీ గవర్నర్ సెంథిల్ తొండైమాన్, నటుడు సూరి, జల్లికట్టు పెరవై అధ్యక్షుడు పిఆర్ రాజశేఖర్ వంటి ప్రముఖులకు చెందిన ఎద్దులు హైలైట్‌గా నిలిచాయి.

Jallikattu : సంక్రాంతి పండుగ సంబురాల్లో భాగంగా తమిళనాడులో జల్లికట్టు, మంజువిరాట్టు కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో చివరి రోజు విషాదం నెలకొంది. జనవరి 16 గురువారం నాడు ఐదుగురు వీక్షకులతో పాటు ఆరుగురు చనిపోయారు. రాష్ట్రంలో జరిగిన వివిధ ఎద్దులను మచ్చిక చేసుకునే పోటీల్లో వందలాది మంది గాయపడ్డారు, రెండు ఎద్దులు కూడా చనిపోయాయి. మదురైలోని అలంగనల్లూర్‌లో ఎద్దు దాడిలో ఓ 55 ఏళ్ల ప్రేక్షకుడు ప్రాణాలు కోల్పోగా.. శివగంగ సిరవాయల్‌లో జరిగిన మంజువిరాట్టు కార్యక్రమంలో అనేక మంది మృత్యువాతపడ్డారు. అక్కడ ఒక ప్రేక్షకుడు, ఎద్దు యజమానితో సహా ఒక ఎద్దు ప్రాణాలు కోల్పోయింది. మరో పక్క కరూర్‌లో జరిగిన ఎద్దు దాడిలో ఛాతీకి గాయమై 66 ఏళ్ల ప్రేక్షకుడు మృతి చెందాడు. మణివేల్ అనే మరో వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ మృతి చెందాడు. పుదుకోట్టైలో, జల్లికట్టు కార్యక్రమంలో వాడివాసల్ నుండి విడిచిపెట్టిన ఒక ఎద్దు అతనిపై దాడి చేసి చంపింది.
తమిళనాడులో జల్లికట్టు పోటీలు జోరుగా సాగాయి. అయితే ఈ పోటీల్లో కొన్నిచోట్ల అపశృతి చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ సంబురాల్లో చివరి రోజైన కనుమ రోజున మధురైలోని అలంగనల్లూర్ జల్లికట్టులో 500 989 ఎద్దులను పట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉదయం 8 గంటలకు జెండా ఊపి ప్రారంభించారు. దీన్ని సాయంత్రం 6:15 గంటలకు ముగించారు. అయితే వాడివాసల్ నుంచి వచ్చిన ఎద్దులు ప్రజల వైపుకు దూసుకుపోయాయి. దీంతో కొంత మంది తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న ఫెన్సింగ్ స్తంభాలు ఎక్కారు. ఈ దాడిలో ప్రేక్షకులతో సహా 70 మందికి పైగా గాయపడ్డారు.
ఉత్తమ ఎద్దుగా బాహుబలి ఎద్దు
ఈ ఉత్సవాల్లో ప్రముఖులు సందడి చేశారు. శ్రీలంక తూర్పు ప్రావిన్స్ మాజీ గవర్నర్ సెంథిల్ తొండైమాన్, నటుడు సూరి, జల్లికట్టు పెరవై అధ్యక్షుడు పీఆర్ రాజశేఖర్ వంటి ప్రముఖులకు చెందిన ఎద్దులు సైతం ఉత్సవాల్లో పాల్గొన్నాయి. అయితే పూవండికి చెందిన అభిచితార్ 20 ఎద్దులను లొంగదీసుకుని టాప్ టామర్‌గా నిలిచాడు. అతను మొదటి బహుమతిగా కారు, దేశీయ జాతి ఆవును పొందాడు. సేలంకు చెందిన బాహుబలి ఎద్దు ఉత్తమ ఎద్దుగా టైటిల్ కైవసం చేసుకుంది. ఇది దాని యజమానికి ట్రాక్టర్, స్థానిక జాతి ఆవును సంపాదించి పెట్టింది. ఇకపోతే సెంథిల్ తొండైమాన్ ఎద్దు ఈ పోటీలో నాల్గవ స్థానంలో నిలిచింది.
అధికారుల ఏర్పాట్లు
జల్లికట్టు పోటీ ప్రారంభం కావడానికి ముందు, అధికారులు ఎద్దులతో పాటు యువకులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీసుల భారీ భద్రతతో పాటు, స్పెషల్ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. అయితే నిర్వాహకులు తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పోటీలో పాల్లొన్న వారికి, వీక్షకులకు మాత్రం ప్రమాదం తప్పలేదు. ఎద్దును లొంగదీసుకునే ప్రక్రియలో భాగంగా వాటి కింద గాయపడినా, చనిపోయే ప్రమాదం ఉన్నా.. పోటీల్లో వెనక్కి మాత్రం తగ్గట్లేదు జనాలు.
Also Read : Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 17 మంది మావోయిస్టులు హతం!