Arya Samaj Marriage Certificate: ఆర్యసమాజ్‌లో పెళ్లిళ్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పెళ్లి సర్టిఫికెట్లు జారీ చేయడం ఆర్య సమాజ్ పని కాదని సుప్రీం వ్యాఖ్యానించింది. ఆర్యసమాజ్ పెళ్లి సర్టిఫికెట్లు గురించబోమని తేల్చిచెప్పింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ప్రేమ వివాహం కేసులో సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఇదీ కేసు
మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ జంట.. తమ కూతుర్ని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు ఓ యువకుడిపై కేసు పెట్టింది. తమ కూతురు మైనర్ అని పేర్కొంది. ఐపీసీ 5(L)/6 పోక్సో చట్టం కింద కేసు పెట్టారు.
అయితే ఆ అమ్మాయి.. మేజర్ అని, ఇష్టపూర్వకంగానే తనను పెళ్లి చేసుకుందని ఆ యువకుడు ప్రమాణపత్రంలో పేర్కొన్నాడు. దీంతో పాటు ఆర్యసమాజ్‌లో వారి పెళ్లికి సంబంధించిన సర్టిఫికెట్‌ను సుప్రీం కోర్టుకు సమర్పించాడు.
ఈ సర్టిఫికెట్‌ను జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఆర్యసమాజ్‌కు పెళ్లి సర్టిఫికెట్లు ఇచ్చే హక్కు లేదని, దీనిని తాము పరిగణించబోమని తేల్చిచెప్పింది. వేరే ఏదైనా అర్హత కలిగిన సర్టిఫికెట్ ఉంటే చూపించాలని తెలిపింది.
ప్రేమ పెళ్లిళ్లకు కేరాఫ్
పెళ్లి అనగానే ప్రేమ జంటలకు వెంటనే గుర్తొచ్చేది ఆర్యసమాజ్ మాత్రమే. పెద్దలు అంగీకరించని ఎన్నో ప్రేమ వివాహాలకు ఆర్యసమాజం వేదికగా నిలిచింది. ఇక్కడ జరిగే ప్రేమ పెళ్లిళ్లకు స్నేహితులే పెళ్లిపెద్దలుగా మారి, సాక్షి సంతకాలు చేస్తున్నారు. ఈ వేదికపై ఇప్పటి వరకు లక్షకు పైగా ప్రేమ జంటలు ఒక్కటయ్యాయి. ఎలాంటి ఆడంభరాలు లేకుండా హిందూ సంప్రదాయం ప్రకారం ప్రేమ జంటలను ఆర్య సమాజ్ ఒక్కటి చేస్తోంది.
ఇక్కడ జరిగే పెళ్లిళ్లలో చాలా వరకు కులాంతర వివాహాలు, పెద్దలు అంగీకరించని వివాహాలే. ఒక వేళ ప్రేమికులిద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారైతే వారిని ముందు శుద్ధిసంస్కారం(మత మార్పిడి) చేసి, ఆ తర్వాత వారికి హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేస్తున్నారు. ఇక్కడ జరిగే పెళ్లిళ్లకు చట్టబద్ధత ఉండటంతో ఇక్కడ పెళ్లి చేసుకునేందుకు అనేక జంటలు ఆసక్తి చూపుతున్నాయి. అయితే తాజాగా సుప్రీం కోర్టు ఆర్యసమాజ్ ఇచ్చే పెళ్లి సర్టిఫికెట్లు చెల్లవని తేల్చి చెప్పింది.
ఏటా 50 వేలకుపైగా
దేశవ్యాప్తంగా ఉన్న ఆర్యసమాజ్ శాఖల్లో ఏడాదికి సగటున 50 వేలకుపైగా వివాహాలు జరుగుతున్నాయి. తెలంగాణలోని వందకుపైగా శాఖల్లో ఏటా రెండు వేల వివాహాలు జరుగుతుండటం విశేషం.
Also Read: ED Summons to Rahul Gandhi: రాహుల్ గాంధీకి మళ్లీ ఈడీ సమన్లు- ఈనెల 13న విచారణకు!
Also Read: Corona Cases: 84 రోజుల తర్వాత 4 వేలు దాటిన కరోనా కేసులు- ఆ రెండు రాష్ట్రాల్లోనే