తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఏడాదిపాలన పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో మరిన్ని వరాలు ప్రజలు ఇచ్చారు. అసెంబ్లీలో స్టాలిన్ ప్రకటన చేస్తూ, "ప్రభుత్వ వార్షికోత్సవ సందర్భంగా, రెండో ఏడాదిలోకి అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 1-5 తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ పథకాన్ని మొదట ఎంపిక చేసిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తాం. తరువాత ఇది అన్ని ప్రాంతాలకు విస్తరించేలా ప్లాన్ చేస్తున్నాం. పిల్లలలో పోషకాహార లోపాన్ని తగ్గించడానికి, తమిళనాడు ప్రభుత్వం పిల్లలకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది." అని స్టాలిన్ ప్రకటించారు.
రాష్టవ్య్రాప్తంగా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ (మోడల్ స్కూల్స్) అభివృద్ధి చేస్తామన్నారు సీఎం స్టాలిన్. రూ.150 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. తొలివిడతగా 25 కార్పొరేషన్లలోని ప్రభుత్వ పాఠశాలలను ఎక్సలెన్స్ స్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేస్తామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వంటి వైద్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం.
శనివారం ముఖ్యమంత్రి తొలుత గోపాలపురంలో తన తల్లి దయాళు అమ్మాళ్‌ను కలుసుకుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం తిరిగి అసెంబ్లీకి వస్తుండగా ముఖ్యమంత్రి తన కారు దిగి ప్రజలతో కలిసి ప్రయాణించారు. 29 సి బస్సులో విహరించారు. 29సి బస్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు స్టాలిన్. ఆ బస్సులో నాడు స్కూల్‌కి వెళ్లే సంగతులు తాను మర్చిపోలేనన్నారు. ఇవాళ అదే బస్సులో సీఎంగా వెళ్తుండటం చాలా ఆనందంగా ఉందన్నారాయన.
29సి బస్‌లో వెళ్తూ అందరితో మాట్లారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలిపారు. పథకాలపై వారి ఆలోచనలు తెలుసుకున్నారు. లోపాలు ఉంటే చెప్పాలని ప్రజలకు సూచించారు. మంచిపాలన అందుతున్నట్టు అందరూ భావిస్తున్నారని అన్నారు స్టాలిన్.