Special Parliament Session: వచ్చే సోమవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగననున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు అంటే సెప్టెంబర్ 22వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ సిబ్బందికి యూనిఫాం సహా పలు మార్పులు, చేర్పులు జరగనున్నాయి. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో జరగనున్న సమావేశాలకు సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ నిర్ణయించారు.
భారతీయ స్ఫూర్తితో ఈ కొత్త యూనిఫాం డిజైన్ ఉంటుందని అధికారిక వర్గాల పేర్కొన్నాయి. మార్షల్స్ వేసుకునే సఫారీ సూట్లకు బదులుగా క్రీమ్ కలర్ కుర్తాలు, పైజామా ధరించనున్నారు. దీంతో పాటు పార్లమెంటరీ గార్డ్ డైరెక్టరేట్్ డ్రెస్ లో కూడా మార్పులు చేశారు. మహిళా ఉద్యోగులు కొత్త డిజైన్ చీరలు ధరించనున్నారు. సెక్రటేరియట్ ఉద్యోగులు క్లోజ్డ్ నెక్ సూట్ స్థానంలో మెజెంటా లేదా డార్క్ పింక్ నెహ్రూ జాకెట్ వేసుకోనున్నారు. పార్లమెంట్ హౌజ్ లోని పురుష ఉద్యోగుల చొక్కాలు ముదురు గులాబీ రంగులో ఉండనున్నాయి. వాటిపై కమలం పూల డిజైన్ ఉండనుంది. ఆ చొక్కాకు అనుసంధానంగా ఖాకీ రంగు ప్యాంటు ధరిస్తారు.
ఉభయసభల్లోని మార్షల్స్ మణిపురి తలపాగాలు ధరించనున్నారు. పార్లమెంట్ భవనంలో భద్రతా సిబ్బంది వేషాధారణ కూడా మారబోతోంది. సపారీ సూట్లకు బదులు మిలటరీ తరహా దుస్తులు ధరిస్తారు. ఉద్యోగుల కొత్త యూనిఫాం ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) రూపొందించింది. ఛాంబర్ అటెండెంట్లు, వెర్బేటిమ్ రిపోర్టింగ్ సర్వీస్ సిబ్బంది సహా మొత్తం 271 మందికి కొత్త యూనిఫాంలు అందజేసినట్లు అధికారులు తెలిపారు. యూనిఫాం అందరికీ ఒకేలా ఉంటుందని పేర్కొన్నాయి. సెప్టెంబర్ 6వ తేదీన అధికారులకు, సిబ్బందికి యూనిఫాం అందించారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన సమయంలోనే ఈ యూనిఫాంను ఆవిష్కరించాలని భావించినప్పటికీ.. జాప్యం వల్ల కుదరలేదు.
సెప్టెంబర్ 19న కొత్త పార్లమెంట్‌లో..
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది కేంద్ర ప్రభుత్వం. పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation,One Election)పైనా చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే దీనిపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటైంది. అయితే...ఈ ప్రత్యేక సమావేశాలు పాత పార్లమెంట్ బిల్డింగ్‌లో జరుగుతాయా..? లేదంటో కొత్త భవనంలో నిర్వహిస్తారా అన్న అనుమానాలు తలెత్తాయి. ఈ విషయంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 18న అంటే...తొలి రోజు సమావేశాలు పాత బిల్డింగ్‌లోనే జరుగుతాయని స్పష్టం చేసింది. ఆ తరవాత సెప్టెంబర్ 19న వినాయక చవితి ( Ganesh Chaturthi) సందర్భంగా కొత్త బిల్డింగ్‌లోకి షిఫ్ట్ అవుతున్నట్టు వెల్లడించింది. అంటే...సెప్టెంబర్ 19-23 వరకూ కొత్త పార్లమెంట్ భవనంలోనే ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్‌ని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అయితే...ఇప్పటి వరకూ ఈ సమావేశాల అజెండా ఏంటన్నది స్పష్టంగా చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం. ఈ విషయమై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిని ప్రశ్నించగా...త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. జూన్1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌ని ప్రారంభించారు. మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులోనే Sengolని ఏర్పాటు చేశారు.