Solar Cooking : పురాతన కాలంలో రాయితో మంట పుట్టించి వంట చేసుకునేవారు. ఆ తర్వాతి కాలంలో కాస్త అభివృద్ధి చెంది కట్టెల పొయ్యిపై వండడం మొదలుపెట్టారు. అనంతరం ఆయిల్, బయో గ్యాస్, వంట గ్యాస్, ఇండక్షన్ స్టవ్ లాంటివి చాలానే వచ్చాయి. సాధారణంగా అయితే ఈ కాలంలో వంట చేసేందుకు ఎల్పీజీ గ్యాస్ ను ఉపయోగిస్తుంటారు చాలా మంది. మరో పక్క సూర్య కాంతితో విద్యుత్ తయారు చేయడం చూస్తూనే ఉన్నాం. దీని వల్ల ఇప్పుడు సోలార్ తో కరెంట్ ఉత్పత్తికి చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు అదే తరహాలో సూర్య కాంతితో వంట చేసుకునే పద్దతి వచ్చింది. ఈ క్రమంలోనే సోలార్ కుక్కర్ లను తయారు చేసి వార్తల్లో నిలిచారు ఓర్జాబాక్స్ వ్యవస్థాపకురాలు, క్లీన్ కుకింగ్ మెంటర్ విశాఖ చందేరీ.


లక్ష్యం పెద్దదే.. కానీ వెనుకడుగు వేయలేదు


పూణేకి చెందిన విశాఖ చందేరీ.. గత 12 ఏళ్లుగా ఎన్విరాన్మెంట్ అండ్ క్లీన్ ఎనర్జీ విభాగంలో పని చేస్తున్నారు. వ్యక్తిగతంగా వంట చేయడం అంటే ఇష్ఠమున్న చందేరీ.. వంట కోసం ప్రత్యామ్నాయ ఇంధనాలను పరిచయం చేసేందుకు కృషి చేశారు. అందులో భాగంగా సాధారణ సోలార్ కుక్కర్‌లను ఎలా తయారు చేయాలో ఇతరులకు కూడా నేర్పిస్తారు. ప్రతి ఇల్లు, పట్టణం, గ్రామీణ ప్రజలు వంట కోసం కనీసం ఒక ప్రత్యామ్నాయ ఇంధనాన్ని ఉపయోగించాలనే లక్ష్యంతో దీన్ని ప్రారంభించానని చందేరీ చెబుతున్నారు. గత 3ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ పై దృష్టి సారించిన చందేరీ.. ఈ లక్ష్యం పెద్దదని తనకు తెలుసని అంటున్నారు. కానీ అంచెలంచెలుగా తన లక్ష్యాన్ని చేరుకునే దిశగా కృషి చేయడం ప్రారంభించానని అన్నారు. స్వచ్ఛమైన ఇంధనాలను, తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడానికి తన వంతు సహకారం అందించాలనుకున్నాని చెప్పారు.


దాదాపు 800మిలియన్లకు పైగా భారతీయులు వంట కోసం సంప్రదాయ బయోమాస్ కుక్‌స్టవ్‌లను ఉపయోగిస్తున్నారు. అందులో దాదాపు 85% గృహాలు కనీసం ఒక స్వచ్ఛమైన ఇంధనాన్ని ఉపయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఉజ్జ్వల పథకం ద్వారా ప్రభుత్వం లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ - ఎల్పీజీ సిలిండర్లను అందించడంలో కీలకపాత్ర పోషించినప్పటికీ.. ఇప్పటికీ ఆ ధరను సైతం పెట్టలేని కుటుంబాలు చాలానే ఉన్నాయి. అలాంటి వారికి ఉన్న గొప్ప వరం సూర్యకాంతి. సోలార్ సాయంతో విద్యుత్ ఉత్పత్తి అవ్వగా లేనిది.. వంట చేయడం సాధ్యం కాదా.. దీనికి సంబంధించిన ఆవిష్కరణ ఇప్పటి వరకు కాలేదు. కానీ చందేరీ దీన్ని చేసి చూపించారు.


ఓర్జాబాక్స్ ఎలా పుట్టిందంటే..


తాను ఉద్యోగాన్ని విడిచిపెట్టి, 2021లో ఓర్జాబాక్స్ లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్‌షిప్ (LLP) అనే పేరుతో ఈ ప్రాజెక్ట్ కోసం పని చేయడం ప్రారంభించానని చందేరీ చెప్పారు. తాము మొదట స్థానిక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలతో (MSMEలు) టైఅప్ అయి, వారికి అవసరమైన డిజైన్‌లను అందించామన్నారు. వారు వాటిని అనుకూలీకరించిన పద్ధతిలో తయారు చేసిస్తారని చెప్పారు. అలా తమ ప్రయాణాన్ని సోలార్ కుక్కర్‌లతో ప్రారంభించి, ఇప్పుడు బయోగ్యాస్, బయోచార్ పెల్లెట్ ఆధారిత ఆవిరి కుక్కర్లు, సోలార్ లైట్లు, సోలార్ డీహైడ్రేటర్‌ల ద్వారా ఇంధనంతో కూడిన వంట స్టవ్‌లను కూడా అందిస్తున్నామని చందేరీ చెప్పారు. ఇవి పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంచుతాయని కూడా చందేరీ తెలిపారు.


సోలార్ కుక్కర్లు ఎలా ఉపయోగపడతాయంటే..


పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకారం.. సోలార్ కుక్కర్లు కమ్యూనిటీ కిచెన్‌లలో పూర్తి వినియోగంపై సంవత్సరానికి 35 నుండి 40 ఎల్పీజీ సిలిండర్‌లను ఆదా చేయవచ్చు. సోలార్ కుక్కర్లు కాలుష్య రహితమైనవి, ఖర్చుతో కూడుకున్నవి. కానీ సాంప్రదాయ పద్ధతులతో పోల్చినప్పుడు ఆహారంలో ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. అదనంగా, సౌర కుక్కర్లు వాటి అనేక ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందాయి. కూరగాయలను ఉడకబెట్టడం, వేయించడం, కాల్చడం కోసం కూడా ఈ కుక్కర్లను ఉపయోగించవచ్చు. పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడానికి, ఓర్జాబాక్స్ విద్యార్థులు, రైతులు, స్వయం సహాయక బృందాలకు (SHGs) స్వచ్ఛమైన వంట సాంకేతికతలను ప్రదర్శించడానికి అవగాహన ప్రచారాలను నిర్వహిస్తోంది.


చందేరీ మాట్లాడుతూ, “సోలార్ వంట సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి పరిధి పరిమాణం, అవసరాన్ని బట్టి రూ. 5,000 - 40,000 మధ్య ఉంటుంది. ఇది చాలా నిర్వహణ-రహితం. దుమ్మును వెలికితీసేందుకు క్రమం తప్పకుండా దీన్ని శుభ్రం చేయాలి. మేం వీటిని ఇన్‌స్టాల్ చేస్తాం. అదెలా పని చేస్తుందో దాని గురించి శిక్షణ ఇస్తాం. అమ్మకం తర్వాత ఏమైనా కావాలంటే సహాయాన్ని అందిస్తాం అని చెప్పారు.


Also Read : Gold-Silver Prices Today 07 Jan: గోల్డ్ కొనేవాళ్లకు ఊరట, రూ.లక్షకు చేరిన సిల్వర్‌ - ఈ రోజు మీ ప్రాంతంలో బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ