Sikkim Flash Floods:


పెరుగుతున్న మృతుల సంఖ్య..


సిక్కిం వరదలు (Sikkim Floods) బీభత్సం సృష్టించాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 56కి పెరిగింది. ఇప్పటి వరకూ 26 మంది మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. మిగతా వాళ్లంతా వెస్ట్‌బెంగాల్‌లోని తీస్తా నదిలో దొరికారు. 142 మంది గల్లంతయ్యారు. వీళ్లను వెతికి పట్టుకునేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఆర్మీ, NDRF కలిసి గాలింపు చర్యలు చేపడుతున్నాయి. వెస్ట్‌బెంగాల్‌కి ఉత్తరాన ఉన్న తీస్తా నదిలోనూ జల్లెడ పడుతున్నారు. 56 మంది చనిపోయినప్పటికీ...అధికారికంగా మృతుల సంఖ్యని 26గా ప్రకటించారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం...ఇప్పటి వరకూ 30 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సిలిగురి, జల్పైగురి, కూచ్ బెహర్‌ ప్రాంతాల్లో తీస్తా నది తీరంలో ఈ డెడ్‌బాడీలు దొరికినట్టు అధికారులు వెల్లడించారు. మిలిటరీ ఎక్విప్‌మెంట్ కూడా వరదల్లో కొట్టుకుపోయినట్టు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. మందు గుండు సామాగ్రి వరదల్లో కొట్టుకు పోయిందని ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రజలు తీస్తా నది ఒడ్డుకు దూరంగా ఉండాలని కోరారు. ఈ ప్రమాదకరమైన పరిస్థితికి సంబంధించి, సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (SSDMA) ఇప్పటికే ఒక సలహాను జారీ చేసింది. ఈ ప్రదేశాలలో వరద నీటిలో కొట్టుకుపోయిన ఇండియన్ ఆర్మీ మందుగుండు సామాగ్రి ఉందని.. దానిని తారుమారు చేస్తే పేలుడు సంభవించే అవకాశం ఉందని SSDMA తెలిపింది.






13 బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయాయ్..


అక్టోబర్ 4వ తేదీన తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. అప్పటి నుంచి వరదలు ముంచెత్తుతున్నాయి. దాదాపు 25 వేల మంది ప్రజల జీవనం స్తంభించిపోయింది. 12 వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. 13 బ్రిడ్జ్‌లు వరదల్లో కొట్టుకుపోయాయి. రహదారులతో పాటు పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకూ 2,413 మందిని కాపాడారు. రాష్ట్రవ్యాప్తంగా 22 చోట్ల రిలీఫ్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో 6,875 మంది వరద బాధితులు తలదాచుకుంటున్నారు. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ (Prem Singh Tamang) పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. రిలీఫ్ క్యాంప్‌లలో తల దాచుకుంటున్న వారికి తక్షణావసరాల కింద ఒక్కొక్కరికీ రూ.2 వేలు అందించనున్నట్టు వెల్లడించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా ఆరా తీస్తున్నారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తున్నారు. ఇప్పటికే రూ.44.8 కోట్ల నిధుల్ని కేటాయించారు. వరద బాధిత ప్రాంతాల్లో Inter-Ministerial Central Team (IMCT) బృందాలు పర్యటించనున్నాయి. రాష్ట్రంలో చాలా చోట్ల పర్యాటకులు చిక్కుకుపోయారు. నార్త్‌ సిక్కిమ్‌లో వరదల్లో కనీసం 3 వేల మంది చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ఎయిర్‌ఫోర్స్‌ సాయంతో వీళ్లను రక్షించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. లోనాక్‌ సరస్సు ప్రాంతంలో భారీ వర్షాలు కరువడంతో తీస్తా నదిలో వరద పోటెత్తింది. దీనితో పాటు చుంగ్ థాంగ్‌ ‌ డ్యామ్‌ నుంచి కూడా నీటిని విడుదల చేయడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. దిగువ ప్రాంతాలకు వరద ముప్పు పెరిగింది.


Also Read: నిజ్జర్ హత్యలో కెనడా వద్ద స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేనే లేదు, గిల్లి కయ్యం పెట్టుకున్నారు - ఎక్స్‌పర్ట్