Sanatan Dharma Row: 


HIV కన్నా డేంజర్..


సనాతన ధర్మం డెంగీ, మలేరియా లాంటిదే అని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల దుమారం ఆగకముందే...మరో వివాదం రాజుకుంది. DMK పార్టీకి చెందిన నేత ఎ.రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం HIV లాంటిదని, ఇదో సామాజిక వ్యాధి అని అన్నారు. HIV కన్నా ప్రమాదకరమైన జబ్బు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజా కామెంట్స్‌పై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్పందించారు. ట్వీట్‌తో రాజాపై మండి పడ్డారు. 


"ఈ దేశంలో 80% మంది అనుసరించే ధర్మాన్ని, మతాన్ని కించపరుస్తున్నారు. డీఎమ్‌కే ఎంపీ రాజా హిందూమతాన్ని సామాజిక వ్యాధి అని అన్నారు. ఇది మత విద్వేష ప్రసంగం కాకపోతే మరేంటి..? ఇది కాంగ్రెస్ అసలు స్వరూపం. విపక్ష కూటమి స్వరూపమూ ఇదే. హిందూ మతాన్ని అనుసరించే వాళ్లను కించపరిచి ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారు"


- అమిత్ మాల్వియా, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ 




సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్  (Udayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలోనే కాదు. దేశవ్యాప్తంగానూ సంచలనం సృష్టించాయి. రాజకీయంగా నిప్పు రాజేసిన ఈ కామెంట్స్‌ని ఇప్పటికే సమర్థించుకున్నారు ఉదయనిధి. లీగల్‌గా ఎవరు ఎలాంటి చర్యలు తీసుకున్నా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇప్పుడు డీఎమ్‌కే నేతలందరినీ ఉద్దేశించి ఓ నోట్ విడుదల చేశారు. అనవసరంగా ఈ వివాదాన్ని పట్టించుకుని టైమ్ వేస్ట్ చేసుకోవద్దని సూచించారు. తనపై విమర్శలు చేసిన వాళ్లపై కేసులు పెట్టడం, వాళ్ల దిష్టి బొమ్మల్ని తగలబెట్టడం లాంటివి చేయొద్దని వెల్లడించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ప్రధాని నరేంద్ర మోదీ, పళనిస్వామి సహా అయోధ్యకు చెందిన సాధువు మహంత్ పరమహన్స్‌పైనా విమర్శలు చేశారు. తన తలను తీసుకొచ్చిన వారికి నజరానా ఇస్తారనని మహంత్ పరమహన్స్‌ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. పెరియార్, అన్నా, కలైజ్ఞర్, పెరసిరియార్ చూపిన బాటలోనే అందరూ నడుద్దాం అంటూ పిలుపునిచ్చారు. సామాజిక న్యాయంపై తనకు నమ్మకముందని తేల్చి చెప్పారు.