కేరళలోని ప్రముఖ శబరిమల క్షేత్రంలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. భోగి పండుగ నాడు (బుధవారం) సాయంత్రం పొన్నాంబలమేడు పైనుంచి మకర జ్యోతి మూడుసార్లు దర్శనమిచ్చింది. మకరజ్యోతిని అయ్యప్ప భక్తులు స్వయంగా వీక్షించి తన్మయత్వం పొందారు. కోట్లాది భక్తులు తమ ఇళ్ల వద్దే పలు మాధ్యమాల ద్వారా శబరిమల మకరజ్యోతి దర్శనం చేసుకున్నారు. మకర జ్యోతి దర్శనం వేళ అయ్యప్ప భక్తుల  స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయింది.

Continues below advertisement

మకర విలక్కు (మకర జ్యోతి) అంటే ఏమిటి?

మకర విలక్కు శబరిమలలోని ప్రధాన ఆధ్యాత్మిక విషయాలలో ఒకటి. మకర జ్యోతి శబరిమల ఆలయం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నాంబలం కొండపై భక్తులకు మూడుసార్లు కనిపిస్తుంది. స్థానిక భక్తుల ప్రకారం, ఈ పవిత్ర మకరజ్యోతిని అయ్యప్ప భగవంతుని దైవిక ఉనికి, ఆశీర్వాదాలకు చిహ్నంగా భావిస్తారు.

Continues below advertisement

మకర జ్యోతి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతమకర విలక్కు (మకర జ్యోతి) అనేది విశ్వాసం, భక్తి, దైవిక శక్తి కలిసే శక్తివంతమైన ఆధ్యాత్మిక క్షణం. అయ్యప్ప మాలధారులు పొన్నాంబలమేడు పైనుంచి కనిపించే మకర జ్యోతి దర్శించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ప్రతి ఏడాది భారీ సంఖ్యలో భక్తులు శబరిమలకు మకర జ్యోతి దర్శనం చూసేందుకు వెళ్తుంటారు. అయ్యప్ప భక్తులు మాలధారణ సమయంలో క్రమశిక్షణతో కూడిన దినచర్యను అనుసరిస్తారు. 

మకర జ్యోతి మతపరమైన ఆచారంగా వస్తుంది. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సమయంలో భోగి పండుగ నాడు పొన్నాంబలమేడు పైనుంచి భక్తులకు మకర జ్యోతి దర్శనమిస్తుంది. ఈ సమయంలో భక్తులు శబరిమల వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటారు. అయ్యప్ప స్వామికి ప్రార్థనలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తుంటారు. మకర జ్యోతిని చూడటం వల్ల తమకు అంతా మంచే జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. 

 

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మకర జ్యోతికి ముందు బుధవారం భారీగా గుంపులు గుమిగూడడంతో గందరగోళం నెలకొంది. మకర జ్యోతి అనేది ఆలయంలో అత్యంత పవిత్రమైన, ప్రధానమైన వేడుకగా భావిస్తారు. మకర జ్యోతి వీక్షించేందుకు దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు శబరిమలకు చేరుకున్నారు. కొండ ప్రాంతంలో ఇప్పటికే యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంది. అటువంటి పరిస్థితి మరింత దిగజారింది. 

గుంపును నియంత్రించే ఉద్దేశ్యంతో పోలీసులు పంపాకు వెళ్లే వాహనాలను పట్టణంలోనే నిలిపివేశారు. ఈ నిర్ణయంతో ఆగ్రహించిన భక్తులు రోడ్డుపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు శరణం జపిస్తూ రోడ్డు మధ్యలో కూర్చొని ట్రాఫిక్‌ను పూర్తిగా స్తంభింపజేసి నిరసన తెలిపారు. వీరిలో పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన యాత్రికులు అధిక సంఖ్యలో ఉన్నారు.

పాదచారులను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం

పంపా నది, నీలక్కల్ ప్రాంతాల్లో అధిక రద్దీ కారణంగా పోలీసులు పాదచారులను అడ్డుకోవడానికి తాడులను ఉపయోగించడంతో పరిస్థితి  ఉద్రిక్తంగా మారింది. స్థానికుల ప్రకారం, శబరిమల చరిత్రలో రద్దీగా ఉండే పెట్టా జంక్షన్ వద్ద పాదచారులను తాడులతో అడ్డుకోవడం ఇదే మొదటిసారి. దీని కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయింది.

పోలీసులు కఠినమైన మార్గదర్శకాలు, సూచనలు 

మకరవిళక్కు ఉత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు, స్థానిక పోలీసులు బుధవారం నాడు కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. అధికారుల ప్రకారం, బుధవారం ఉదయం 10 గంటల వరకు మాత్రమే పంపా- నీలక్కల్ రోడ్డులో వాహనాలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత అన్ని వాహనాలను నీలక్కల్‌లో నిలిపివేస్తారు. దీంతో పాటు ఉదయం 11 గంటల తర్వాత ఏ యాత్రికుడినీ పంపా నుండి సన్నిధానం వరకు కాలినడకన వెళ్లడానికి అనుమతించరు. ఈ చర్యలు భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నామని అధికారులు చెబుతుండగా, మెరుగైన నిర్వహణ, సమన్వయం కోసం భక్తులు డిమాండ్ చేస్తున్నారు.