Hema Malini On Kangana Ranaut: వచ్చే ఎన్నికల్లో యూపీ రాష్ట్రంలో మధుర లోక్ సభ నుంచి నటి కంగనా రనౌత్ పోటీ చేస్తారనే ఊహాగానాలపై తాజాగా బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని స్పందించారు. కంగనా ఇక్కడినుంచి పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు 'బాగుంది.. బాగుంది' అంటూ వ్యాఖ్యానించారు. మధుర నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హేమమాలిని పాల్గొన్నారు. దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే ఆమెకు కంగనా రాజకీయ అరంగేట్రంపై ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు బదులిస్తూ మధురకు సినిమా తారలు మాత్రమే కావాలా అని అన్నారు. రేపు రాఖీ సావంత్ కూడా పోటీకి రెడీ అవుతారంటూ సెటైర్ వేశారు. అయినా అది దేవుడి ఇష్టమని.. శ్రీకృష్ణుడు తను కోరుకున్నది చేస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. 


గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాజకీయాల్లో చేరతారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆమె ఎన్నికల్లో పోటీ చేసే సూచనలు లేకపోయినా.. గతేడాది డిసెంబరులో మధురలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పుడు మీడియాతో మాట్లాడుతూ.. తాను జాతీయవాదుల కోసం ప్రచారం చేస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే.. వార్తా సంస్థ ఏఎన్ ఐ ట్విటర్లో షేర్ చేసిన ఓ వీడియోకు ప్రతిస్పందనగా ఒక యూజర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయ్యింది. 'ఓ మహిళ స్వయంగా సినీ నటి. ఆమె భర్త, కుమారుడు రాజకీయాల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఆమెకు సినీ తారలు రాజకీయాల్లోకి రావడం సమస్యగా ఉందా' అని వ్యాఖ్యానించారు.