ABP CVoter Rajasthan Exit Poll:


రాజస్థాన్ ఎగ్జిట్ పోల్ 


రాజస్థాన్‌లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, ఈ సారి కచ్చితంగా తామే గెలుస్తామని బీజేపీ గట్టిగానే ప్రచారం చేసుకుంది. మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని కాషాయ పార్టీ పట్టుదలతో ఉంది. ఈ ఎన్నికలపై ABP CVoter Exit Poll అంచనాలు వెల్లడించింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ 81 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 100 స్థానాలు గెలుచుకుంది. ఈ సారి దాదాపు 20 స్థానాలు కోల్పోనుందన్నది ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ అంచనా. అటు బీజేపీ మాత్రం గత ఎన్నికలతో పోల్చితే ఈ సారి పుంజుకుంటుందని తెలిపింది. పోయిన ఎన్నికల్లో 73 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈ సారి 104 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయి. బీఎస్‌పీ గత ఎన్నికల్లో 6 స్థానాలు గెలుచుకున్నప్పటికీ..ఈ సారి మాత్రం ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేదని అంచనా వేసింది ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్. మొత్తంగా చూస్తే...కాంగ్రెస్‌కి ఈ సారి 71-91 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీకి 94-114 సీట్లు సాధించే అవకాశముందని అంచనా వేసింది. అంటే గరిష్ఠంగా బీజేపీకి 114 సీట్లు వస్తాయి. ఈ రకంగా చూస్తే...బీజేపీకే ఎక్కువగా విజయావకాశాలున్నాయి. ఓట్ల శాతం పరంగా చూస్తే...కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో 39.3% ఓట్లు సాధించుకుంది. ఈ సారి స్వల్పంగా 41.1%కి పెరిగే అవకాశముంది. బీజేపీకి గత ఎన్నికల్లో 38.8%, ఈ ఎన్నికల్లో 44.7% ఓట్లు సాధించే అవకాశముందని అంచనా వేసింది ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్. 


సినారియో -1


ప్రస్తుతం రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉంటే కాంగ్రెస్‌కి 55-65 సీట్లు మాత్రమే దక్కుతాయని ఎగ్జిట్ పోల్‌ అంచనా వేసింది. ఇదే సమయంలో బీజేపీ 130-140 స్థానాలొస్తాయని తెలిపింది. బీఎస్‌పీ 0-2 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడించింది. 


సినారియో -2


ప్రభుత్వంపై కాస్తో కూస్తో సానుకూలత ఉంటే కాంగ్రెస్‌కి 91-101 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీకి 88-98 స్థానాలొస్తాయని అంచనా వేసింది ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్. బీఎస్‌పీ 0-2 స్థానాలకు పరిమితం కానుంది. ఇతరులు 0-10 స్థానాలు గెలుచుకోనున్నారు.