New Year 2025 Invitation : మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ రాబోతోంది. ఇప్పటికే చాలా చోట్ల కొత్త సంవత్సరం వేడుకల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సెలబ్రేషన్స్ ను పురస్కరించుకుని అనేక హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు తమ కస్టమర్ల కోసం అనేక ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. ఈ ఇయర్ ను స్పెషల్ గా ముగింపు పలుకుతూ.. కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ పార్టీకి ఓ పబ్ ఇచ్చిన ఇన్విటేషన్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇన్విటేషన్‌తోపాటు కండోమ్ ప్యాకెట్, ఓఆర్ఎస్ పంపించి అందర్నీ షాక్ కు గురి చేసింది. ఇది అంతటా విమర్శలకు దారి తీసింది.  దీనిపై కాంగ్రెస్ పార్టీ సైతం తీవ్రంగా స్పందించింది. సదరు పబ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 


పోలీసులకు ఫిర్యాదు చేసిన నేతలు


మహారాష్ట్రలోని పూణే నగరంలో ఈ సంఘటన జరిగింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్న ఈ ఘటనలో ఓ పబ్.. న్యూ ఇయర్ పార్టీ ఇన్విటేషన్‌తో పాటు కండోమ్ ప్యాకెట్, ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) పంపడం వివాదాస్పదంగా మారింది. ఓ నివేదిక ప్రకారం ఇన్విటేషన్, పంపిణీ చేసిన వస్తువులతో కూడిన విజువల్స్ వైరల్ కావడంతో మహారాష్ట్ర ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ పూణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసింది. "మేము పబ్‌లు, నైట్‌లైఫ్‌లకు వ్యతిరేకం కాదు. కానీ యువకులను ఆకర్షించే ఈ తరహా మార్కెటింగ్ వ్యూహం పూణే నగర సంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధం. పబ్ నిర్వహణపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం" అని మహారాష్ట్ర ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ సభ్యుడు అక్షయ్ జైన్ అన్నారు. 


ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. వెంటనే కేసు నమోదు చేశారు. ఈ న్యూ ఇయర్ ఇన్విటేషన్ కార్డును అందుకున్న పలువురిని పిలిచి విచారణ జరిపినట్లు పోలీసులు వివరించారు. ఇక ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూ ఇయర్ పార్టీ అంటే ఎంజాయ్ చేయాలి. కానీ అందుకు ఎలాంటి పనులకైనా సిద్ధమవడం సరికాదని ఆరోపిస్తున్నారు. ఈ పార్టీకి సంబంధించి పలువురు ఆహ్వానితుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు ధృవీకరించారు.  


ఇన్విటేషన్ ను సమర్థించిన పబ్ మేనేజ్మెంట్


చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనను పబ్ మేనేజ్‌మెంట్ సమర్థించుకుంది. కండోమ్స్, ORS ప్యాకెట్లను పంపిణీ చేయడం భద్రత, అవగాహన ప్రచారంలో భాగమని తెలిపింది. తాము కండోమ్‌లు పంపిణీ చేయడంలో ఎలాంటి తప్పూ లేదని చెప్పుకొచ్చింది. కేవలం భద్రత, అవగాహన పేరుతో తాము ఇలా చేశామని చెప్పింది. యువతలో అవగాహన కల్పించడానికి, మేము కండోమ్స్, శానిటరీ ప్యాడ్‌లను సైతం పంపిణీ చేసాం" అని పబ్ యాజమాన్యం పేర్కొంది. ఈ ఉదంతంపై ప్రస్తుతం పూణే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పబ్ యాజమాన్యం నుంచి కీలక వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది.


Also Read : Drugs Possession : గంజాయి కేసులో ఎమ్మెల్యే కొడుకు సహా తొమ్మిది మంది అరెస్ట్ - ఖండించిన ఎమ్మెల్యే