Presidential Polls: యావత్ దేశం అంచనాలను నిజం చేస్తూ భారత 15వ రాష్ట్రపతిగా గిరి పుత్రిక ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఆమె ఘన విజయం సాధించారు. ముందు నుంచి ద్రౌపది ముర్ము విజయం ఖాయమే అని వార్తలు వచ్చినా, ఆమెకు విపక్షాల నుంచి కూడా క్రాస్ ఓటింగ్ వచ్చినట్లు తాజాగా తెలుస్తోంది.
మొత్తం ఓట్లు
యశ్వంత్ సిన్హాపై 2,96,626 విలువైన ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ చేసిన ప్రకటన ప్రకారం
- మొత్తం పోలైన ఓట్లు: 4,754
- చెల్లుబాటు అయిన ఓట్లు: 4,701
- ద్రౌపది ముర్ము ఓట్ల విలువ: 6,76,803
- యశ్వంత్ సిన్హా ఓట్ల విలువ: 3,80,177
క్రాస్ ఓటింగ్ ఇలా
యశ్వంత్ సిన్హాకు ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, సిక్కింలలో ఒక్క ఓటు కూడా పడలేదు. ద్రౌపదీ ముర్ముకు అలాంటి పరిస్థితి ఒక్కచోటా ఎదురుకాలేదు. కేరళలో 100% ఓట్లు యశ్వంత్ సిన్హాకే పడతాయని అంతా భావించారు. కానీ అక్కడ కూడా ద్రౌపదికి ఒక ఓటు దక్కింది. పంజాబ్, దిల్లీల్లో ఆమెకు 8 ఓట్లే పడ్డాయి.
అయితే విపక్షాలకు చెందిన 17 మంది ఎంపీలు, 126 మంది ఎమ్మెల్యేలు ద్రౌపదికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసినట్లు భాజపా వర్గాలు చెబుతున్నాయి.
ఆమెకు తక్కువ
2017 ఎన్నికల్లో రామ్‌నాథ్ కోవింద్‌కు వచ్చిన 65.65% ఓట్ల కంటే ద్రౌపదికి కాస్త తగ్గాయి. అప్పటి ప్రతిపక్ష అభ్యర్థి మీరాకుమార్‌కు వచ్చిన 34.35% ఓట్ల కంటే యశ్వంత్ సిన్హాకు కొంత ఎక్కువ వచ్చాయి.
అయితే క్రాస్ ఓటింగ్‌తో ద్రౌపది మెజార్టీ ఆశించినదానికన్నా పెరిగింది. ముర్ముకు ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, గుజరాత్‌ల్లో అత్యధిక ఓట్లు వచ్చాయి.
యశ్వంత్‌సిన్హాకు పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, దిల్లీలలో అధికార పార్టీ కంటే ఎక్కువ ఓట్లు దక్కాయి.
శుభాకాంక్షల వెల్లువ
రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ద్రౌపదికి ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆమె సాధించిన విజయాన్ని చూసి ఒడిశా మొత్తం గర్విస్తుందని ప్రకటన విడుదల చేశారు.
Also Read: Draupadi Murmu Profile: ద్రౌపది ముర్ము ఘనవిజయం- రాష్ట్రపతి పీఠంపై తొలి గిరిజన మహిళ
Also Read: Droupadi Murmu: గిరిజనులకు అతి పెద్ద అండ దొరికినట్టే, ద్రౌపది విజయంతో ఆ వర్గాల ఆనందం