Indore: గుడి బయట యాచకురాలికి బిచ్చం వేసి అడ్డంగా బుక్కయ్యాడు - వ్యక్తిపై కేసు నమోదు, రూ.5 వేలు జరిమానా లేదా జైలు శిక్ష
Indore News: మధ్యప్రదేశ్ ఇండోర్‌లో గుడి బయట ఓ యాచకురాలికి బిచ్చం వేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో నేరం రుజువైతే సదరు వ్యక్తి రూ.5 వేల జరిమానా లేదా జైలు శిక్ష విధించే ఛాన్స్ ఉంది.
Police Case On Person Who Gave Money To Beggar In Indore: గుడి బయట ఉన్న యాచకురాలికి బిచ్చం వేసిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్‌లో (Indore) జరిగింది. భిక్షాటన నిరోధక బృందం అధికారి ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్ 223 కింద గురువారం ఈ కేసు నమోదైంది. కోర్టులో ఈ నేరం రుజువైతే సదరు వ్యక్తికి రూ.5 వేల జరిమానా లేదా ఏడాది జైలుశిక్ష.. లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది. కాగా.. ఇండోర్ నగరాన్ని తొలి యాచక రహిత నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో స్థానిక అధికార యంత్రాంగం ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి బిచ్చ వేయడం, స్వీకరించడాన్ని నిషేధించింది. ఈ క్రమంలోనే పలువురు బిచ్చగాళ్లను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
అంతే కాకుండా నగరంలో ఎక్కడైనా భిక్షాటన జరుగుతున్న సమాచారం ఇస్తే రూ.వెయ్యి బహుమతి ప్రకటించారు. గత 3 వారాలుగా నగరంలో చాలామంది ఈ రివార్డులు అందుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాలను యాచక రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ 10 నగరాలను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసింది. ఇండోర్‌తో పాటు ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి.
Also Read: US Red Dye : వంటల్లో రెడ్ కలర్ వినియోగం నిషేధం - అమెరికా కీలక నిర్ణయం - మరి మన సంగతేంటి ?