వడోదర: గుజరాత్‌లోని వడోదరలో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్‌షో నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తరువాత తొలిసారి గుజరాత్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి స్వరాష్ట్రంలో ఘన స్వాగతం లభించింది. వడోదరలో రోడ్‌షో సమయంలో ప్రధాని మోదీ కాన్వాయ్‌ నుంచి చేతులు ఊపుతూ ముందుకు కదిలారు. మరోవైపు ప్రజలు ఆయనపై పూలవర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు.

మే 26-27 తేదీల్లో ప్రధాని మోదీ గుజరాత్‌లో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఏకంగా రూ. 82,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు, కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు. భారత ఆర్మీ ఆఫీసర్ కల్నల్ సోఫియా ఖురేషీ కుటుంబ సభ్యులు కూడా ప్రధానమంత్రి మోడీ రోడ్‌షోలో పాల్గొని పూల వర్షం కురిపించారు.   

“భారతమాత కి జై”, “మోడీ-మోడీ”, “వందేమాతరం” అనే నినాదాలతో వడోదర మార్మోగింది. స్పెషల్ ‘సిందూర్ సన్మాన యాత్ర’లో పాల్గొన్న ప్రజలు జాతీయ జెండా ఊపుతూ, ప్రధాని మోదీపై పూలవర్షం కురిపించారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద శిబిరాలపై  సైనిక చర్య తర్వాత ఆయన తన స్వస్థలం గుజరాత్‌కు తొలిసారిగా వచ్చారు.

ప్రధాని మోదీ దాహోద్ కు చేరుకుని సోమవారం ఉదయం 11:15 గంటలకు లోకోమోటివ్ తయారీ కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం దాహోద్ లో దాదాపు రూ.24,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభిస్తారు. దహోద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండు రైళ్లను ప్రారంభించారు. అనంతరం సభలో పాల్గొని ప్రసంగించనున్నారని పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. సబర్మతి-వేరవల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, వారంలో 6 రోజులు నడుస్తుంది. ఆ వందే భారత్ సబర్మతిని సోమనాథ్ ఆలయం సమీపంలోని వేరవల్‌తో కలుపుతుంది. రెండవది వాల్సాద్-దహోద్ ఎక్స్‌ప్రెస్ రైలు వారం రోజులపాటు సేవలు అందిస్తుంది. ఇది 17 బోగీలతో 346 కి.మీ దూరం ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు.

సాయంత్రం 4 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భుజ్ కు వెళ్లనున్నారు. భుజ్ లో రూ.53,400 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు, కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులలో కాండ్లా పోర్ట్, సౌరశక్తి, విద్యుత్ ప్రసారం, రోడ్డు మౌలిక సదుపాయాలు మొదలైనవి ఉన్నాయి.