1st Hydrogen Train In India: భారత్‌లో తొలి పర్యావరణహిత హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ 10 కోచ్‌ల రైలు నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తూ కాలుష్య రహితంగా ప్రయాణిస్తుంది. ఈ తొలి హైడ్రోజన్ రైలు హరియాణాలోని జింద్- సోనిపత్ మధ్య సేవలు అందిస్తుంది.
భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన రైలు పట్టాలెక్కింది. హరియాణాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును లాంఛనంగా ప్రారంభించారు. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలకు పెద్దపీట వేస్తూ, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన ఇంజినీర్లు ఈ మోడ్రన్ రైలును రూపొందించారు. స్టీమ్, డీజిల్, విద్యుత్ రైళ్ల తర్వాత భారత రైల్వే ప్రస్థానంలో ఇదొక మైలురాయిగా నిలిచింది.
హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు ఇవే..
హైడ్రోజన్ రైలు సాధారణ విద్యుత్ రైళ్లలా కాకుండా, తన శక్తిని తానే స్వయంగా ఉత్పత్తి చేసుకుంటుంది. ఇందులోని 1,200 కిలోవాట్ల సామర్థ్యం గల ప్రొటాన్ ఎక్స్‌ఛేంజ్ మెంబ్రేన్ ఫ్యూయెల్ సెల్ ప్లాంట్‌లో హైడ్రోజన్, ఆక్సిజన్ల మధ్య రసాయన చర్య జరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ 3,200 హెచ్‌పీ ప్రొపల్షన్ వ్యవస్థ ద్వారా మోటార్లకు అంది, రైలు గంటకు దాదాపు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా చేస్తుంది. ఇంధన దహనచర్య లేకపోవడం వల్ల హైడ్రోజన్ రైలు నుంచి కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే వెలువడుతాయి. హానికారక కర్బన ఉద్గారాలు, శబ్ద కాలుష్యం లేని పర్యావరణహిత ప్రయాణం వీలవుతుంది.
ఈ రైలులో అత్యున్నత రక్షణ ప్రమాణాలతో కూడిన పలు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. హైడ్రోజన్ లీకేజీలు, వేడి లేదా మంటలను క్షణాల్లో గుర్తించి అప్రమత్తం చేసే ఆటోమేటిక్ షట్‌ఆఫ్ వ్యవస్థను సెటప్ చేశారు. నిరంతర వెంటిలేషన్ సౌకర్యం వల్ల ఒకవేళ లీకేజీ జరిగినా గ్యాస్ గాల్లో కలిసిపోతుంది. లోకోపైలట్ కేబిన్‌ను సైతం ప్రత్యేకంగా డిజైన్ చేసి, అన్ని భద్రతా అంశాలను పర్యవేక్షించేలా ఇందులో స్క్రీన్‌ను అమర్చి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ రైలు నిర్వహణ కోసం జింద్‌లో ప్రత్యేకంగా హైడ్రోజన్ నిల్వ, డిస్పెన్సింగ్ కేంద్రాన్ని నిర్మించారు.
తొలి దశలో ఈ హైడ్రోజన్ రైలు నార్త్ రైల్వే పరిధిలోని హర్యానాలోని జింద్- సోనిపత్ మధ్య 89 కిలోమీటర్ల మార్గంలో 12 స్టేషన్లలో హాల్ట్ ద్వారా ప్రయాణించనుంది. రానున్న రోజుల్లో కల్కా- షిమ్లా వంటి మార్గాల్లోనూ హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా జర్మనీ, చైనా వంటి దేశాల్లో 2 నుండి 4 కోచ్‌లతో మాత్రమే హైడ్రోజన్ రైళ్లు నడుస్తుండగా, భారత్ మాత్రం రికార్డు స్థాయిలో 10 కోచ్‌లతో, ఒకేసారి 2,600 మంది ప్రయాణించేలా రైలును తీసుకొచ్చారు.
అరుదైన దేశాల జాబితాలో భారత్
ప్రస్తుతం చైనా, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, అమెరికాలో హైడ్రోజన్ రైళ్లు నడుస్తుండగా తాజాగా భారత్ వాటి సరసన చేరింది. ఈ రైళ్లు హైడ్రోజన్, ఆక్సిజన్‌ను విద్యుత్తుగా మార్చేందుకు హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్స్ ఉపయోగిస్తాయి. చివరగా ప్రక్రియ పూర్తయ్యాక కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేయడంతో పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. భారత్ సైతం త్వరలో మరిన్ని ప్రాంతాలకు హైడ్రోజన్ రైళ్లను ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ నిర్వహించి మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తేనుంది.
