పార్లమెంటులో మూడో రోజు అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష కూటమి I.N.D.I.A పై వ్యాఖ్యలు చేశారు. అది పాత బిల్డింగ్‌కి కొత్త పెయింట్ వేసినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. యూపీఏని I.N.D.I.Aగా పేరు మార్చినంత మాత్రాన ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకోలేరని మోదీ అన్నారు. దీన్ని అహంకారపూరితమైన సంకీర్ణ కూటమిగా అభివర్ణించారు. అదే అనవసర పనిని మళ్లీ మళ్లీ మొదలుపెట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందని రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ విమర్శించారు. అంతేకాకుండా, తన సుదీర్ఘ ప్రసంగంలో విపక్షాలపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూనే ఉన్నారు. వాటిలో కొన్ని..


* ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టడం దేవుడి దీవెనగా భావిస్తున్నాను. 2018లో కూడా ప్రతిపక్షాలు నాపై ఇలాంటిదే తీసుకొచ్చాయి. ఇది దేవుడి కల్పన. ఇది మాకు శుభపరిణామం, మేం రికార్డులు బద్దలు కొట్టి మళ్లీ అధికారంలోకి వస్తాం. మా ప్రభుత్వంపై దేశ ప్రజలు పదే పదే చూపుతున్న విశ్వాసం - కోట్లాది దేశ ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇక్కడకు వచ్చాను.


* మణిపూర్ ప్రజలకు నేను హామీ ఇవ్వాలనుకుంటున్నాను - దేశం మీ వెంట నిలుస్తుంది, ఈ పార్లమెంట్ మీ వెంట ఉంది. మణిపూర్ ఈ సంఘర్షణ నుండి బయటపడి త్వరలో అభివృద్ధి, పురోగతి పథంలో పయనిస్తుంది. అది మళ్లీ శాంతిని చూస్తుంది. ప్రతిపక్షాలకు అధికార దాహం ఉంది. పేద ప్రజల ఆకలిని పట్టించుకోవడం లేదు. ఈ తీర్మానంపై మీరు ఎలాంటి చర్చలు జరిపారు.


* ఈ అవిశ్వాస తీర్మానంపై మీరు ఎందుకు సిద్ధం కాకూడదని నేను ప్రతిపక్షాలను అడగాలి. 2018లో దీని కోసం రెడీ అవ్వడానికి నేను మీకు 5 సంవత్సరాల సమయం ఇచ్చాను. అయినా మీరు సిద్ధపడలేదు.
* ఇక్కడ సెంచరీలు (ట్రెజరీ బెంచ్‌లు) కొడుతున్నాం. వారి నుంచి (విపక్షాల నుంచి) నో బాల్స్ వస్తున్నాయి.
* ప్రతిపక్ష నాయకులు ఒక రహస్య ఆశీర్వాదం పొందారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్లు ఎవరి చెడు అయినా కోరుకున్నప్పుడు, ఆ వ్యక్తి మరింతగా అభివృద్ధి చెందుతాడు. ఆ ఉదాహరణలలో నేనూ ఒకడిని.
* మన దృష్టి దేశాభివృద్ధిపైనే ఉండాలి. ఇది అవసరం. కలలను సాకారం చేసుకునే శక్తి మన యువతకు ఉంది. దేశంలోని యువతకు అవినీతి రహిత ప్రభుత్వం, ఆకాంక్షలు, అవకాశాలను అందించాలి.
* 2028 నాటికి, నా ప్రభుత్వంపై ప్రతిపక్షం మరో అవిశ్వాస తీర్మానం తీసుకురావచ్చు. కానీ, భారతదేశం ప్రపంచంలోని టాప్ 3 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంటుంది.
* స్టాక్ మార్కెట్ పట్ల ఆసక్తి ఉన్నవారికి నా చిట్కా. ప్రభుత్వ కంపెనీలలో పెట్టుబడి పెట్టండి మరియు మీ డబ్బు పెరుగుతుంది.
* సరిహద్దులపై దాడులు చేయడం, ఉగ్రవాదులను మన భూభాగంలోకి పంపడం వంటి చర్యలను దీటుగా మనం తిప్పికొట్టినప్పుడు.. కాంగ్రెస్, వారి స్నేహితులు పాకిస్థాన్‌ను విశ్వసించేవారు.


* స్వచ్ఛ భారత్ మిషన్‌ను విమర్శించారు, జన్ ధన్ పథకం గురించి చెడు వ్యాప్తి చేశారు. యోగా, ఆయుర్వేదాన్ని అపహాస్యం చేశారు. స్టార్ అప్ ఇండియా, డిజిటల్ ఇండియా గురించి నెగటివిటీ వ్యాప్తి చేశారు. వాటిలో ఈ రోజు భారతదేశం ముందుంది. మేం మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడితే, వారు మేక్ ఇన్ ఇండియా అంటూ ఎగతాళి చేశారు. కాంగ్రెస్, దాని మిత్రులకు భారతదేశ సామర్థ్యంపై ఏనాడూ నమ్మకం లేదు.