PM Modi Mann Ki Baat: 


26/11 దాడులపై మోదీ కామెంట్స్..


ప్రధాని నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్ కార్యక్రమంలో 26/11 దాడుల (Mumbai Terror Attack) గురించి ప్రస్తావించారు. ఈ దాడులు జరిగి 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా అప్పటి విషాదాన్ని గుర్తు చేసుకున్నారు. 107వ ఎపిసోడ్‌లో ముంబయి ఉగ్రదాడులపై మాట్లాడారు. దేశం ఈ విషాదాన్ని ఎప్పటికీ మరిచిపోలేదని అన్నారు. ఈ ఘోరమైన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు.


"నవంబర్ 26వ తేదీని దేశం ఎప్పటికీ మరిచిపోలేదు. భారత్‌పై ఉగ్రవాదులు దారుణంగా తెగబడ్డారు. ముంబయితో పాటు మొత్తం దేశాన్ని వణికించారు. కానీ ఇప్పుడు భారత్ పూర్తిగా మారిపోయింది. అలాంటి దాడులు మళ్లీ జరగకుండా అన్ని విధాలుగా సామర్థ్యాన్ని సంపాదించుకుంది. ఉగ్రవాదాన్ని విజయవంతంగా అణిచివేస్తోంది"


- ప్రధాని నరేంద్ర మోదీ  


 






2008లో నవంబర్ 26వ తేదీన పాకిస్థానీ ఉగ్రవాదులు ముంబయిలోకి చొరబడి వరుస దాడులు చేశారు. ఈ దాడుల్లో ఎంతో మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. AK-47 రైఫిల్స్‌తో విరుచుకుపడ్డారు. సిటీలోని పలు చోట్ల దాడులకు పాల్పడ్డారు. ఛత్రపతి శివాజీ టర్నినస్ రైల్వే స్టేషన్‌తో పాటు తాజ్‌ మహల్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రిడెంట్ హోటల్, నరిమన్ హౌజ్ జూయిష్ కమ్యూనిటీ సెంటర్‌పైనా దాడులు జరిగాయి. భద్రతా బలగాల కళ్లుగప్పి అరేబియన్ సముద్రం ద్వారా ముంబయిలో అడుగు పెట్టారు ఉగ్రవాదులు. ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. కోట్ల రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. Anti-Terrorism Squad (ATS) చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబయి అడిషనల్ పోలీస్ కమిషనర్ అశోక్ కంటే, సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలస్కర్‌ ప్రాణాలొదిలారు. ఉగ్రవాదులపై ఎదురు కాల్పులకు దిగిన భద్రతా బలగాలు 9 మందిని మట్టుబెట్టారు. అజ్మల్ కసబ్‌ని అదుపులోకి తీసుకున్నారు. 2012లో నవంబర్ 21న ఉరి తీశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ దాడులను గుర్తు చేసుకున్నారు. ఉగ్రవాదంపై పోరాడాలంటూ ట్వీట్ చేశారు.