Modi Tour In Manipur: ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 13న శనివారం మణిపూర్ ను సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి కార్యదర్శి పునీత్ కుమార్ గోయల్ ఇంఫాల్‌లో మాట్లాడుతూ, ఈ పర్యటన రాష్ట్రంలో శాంతి, సాధారణ స్థితి, అభివృద్ధికి మార్గం చూపిస్తాయని అన్నారు. ప్రధాని మోదీ మణిపూర్‌ వెళ్లకపోవడంపై ప్రతిపక్షాలు నిరంతరం విమర్శలు చేస్తున్న సమయంలో పర్యటన జరుగుతోంది. కుకీ, మెయిటీ వర్గాల మధ్య రెండేళ్ల క్రితం మణిపూర్‌లో హింస చెలరేగింది. ఈ హింసాత్మక ఘర్షణలో 260మందికి పైగా మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

ప్రధాని మోదీ మణిపూర్, మిజోరాంలలో పర్యటిస్తారు. మిజోరాంలో బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. మణిపూర్‌లోని చురచంద్పూర్ పీస్ గ్రౌండ్ (ఇక్కడ కుకీ వర్గం ఎక్కువగా ఉంది)లో రూ.7,300 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అదే సమయంలో, మెయిటీలు ఎక్కువగా ఉన్న ఇంఫాల్‌లో ప్రధాని రూ.1,200 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.

భద్రతా ఏర్పాట్లు

ప్రధాని మోదీ కార్యక్రమాల గురించి వివరిస్తూ, మణిపూర్ ప్రభుత్వం చురచంద్పూర్ పీస్ గ్రౌండ్, కాంగ్లా కోట ఇంఫాల్‌లలో పెద్ద బోర్డులు ఏర్పాటు చేసింది. ప్రజల కోసం ప్రత్యేక సూచనలు జారీ చేశారు, తాళాలు, పెన్నులు, వాటర్ బాటిల్స్, బ్యాగులు, రుమాలు, గొడుగులు, లైటర్లు, అగ్గిపెట్టెలు వంటివి తీసుకురాకూడదని సూచించారు.

అంతేకాకుండా, పిల్లలను (12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు)  అనారోగ్యంతో ఉన్న వ్యక్తులను కార్యక్రమ స్థలానికి తీసుకురావద్దని కూడా సూచించారు. చురచంద్పూర్ జిల్లాలో ఇప్పటికే ఎయిర్ గన్లపై నిషేధం విధించారు. ఇంఫాల్, చురచంద్పూర్‌లలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

ఈ పర్యటన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అసోం చేరుకుంటారు. అక్కడ రెండు రోజులు పర్యటిస్తారు. భారతరత్న అవార్డు గ్రహీత భూపేన్ హజారికాకు నివాళులు అర్పించడానికి రాష్ట్రంలో రూ.19,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు.  ప్రముఖ గాయకుడు 'భారతరత్న భూపేన్ హజారికా' ను గౌరవించేందుకు రూ.100 స్మారక నాణెం విడుదల చేస్తారు. ఈ వేడుకల్లో 1200 మంది కళాకారులు హజారికాకు సంబంధించిన 14 పాటలను పాడతారు.

ప్రధాని శనివారం సాయంత్రం 4.20 గంటలకు ఇక్కడికి చేరుకుని సాయంత్రం 5.15 గంటలకు హజారికా జన్మ శతాబ్ది వేడుకల సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. శనివారం అక్కడే బస్ చేసి ఆదివారం దరాంగ్ జిల్లాలోని మంగళ్‌డోయ్‌కు బయలుదేరి వెళ్తారు, అక్కడ ఉదయం దరాంగ్ మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్, GNM స్కూల్‌కు శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు.

ప్రధానమంత్రి అస్సాంలోని కామ్రూప్, దరాంగ్ జిల్లాలను, మేఘాలయలోని రి భోయ్‌ను అనుసంధానించే రూ. 7,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నరేంగి-కురువా వంతెన, గౌహతి రింగ్ రోడ్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేస్తారు. గోలాఘాట్ జిల్లాలోని నుమాలిఘర్ రిఫైనరీకి బయలుదేరి, రూ. 5,000 కోట్లకుపైగా వెదురు ఆధారిత ఇథనాల్ ప్లాంట్‌ ప్రారంభిస్తారు. రూ.7,000కోట్లకుపైగా విలువైన పెట్రో ఫ్లూయిడైజ్డ్ కాటలిటిక్ క్రాకర్ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు.

నుమాలిగఢ్ ట్యాంకర్ స్టాండ్ వద్ద జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ఆదివారం సాయంత్రం జోర్హాట్ విమానాశ్రయం నుంచి ప్రధానమంత్రి కోల్‌కతాకు బయలుదేరుతారు. ప్రధానమంత్రిని గౌరవించేందుకు నుమాలిగఢ్ ర్యాలీ వేదికకు వెళ్లే 2.2 కి.మీ. పొడవునా వేప చెట్లను నాటడంతో ''పీఎం నీమ్ కారిడార్''ను రూపొందించారు. గురువారం ఏర్పాట్లను సమీక్షించడానికి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అక్కడ ఒక మొక్కను నాటారు. హజారికా శతాబ్ది ఉత్సవాలకు, ప్రధానమంత్రి రాబోయే పర్యటనకు సన్నాహాలను సమీక్షించారు. ''ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను నిర్ధారించాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు'' అని సీఎంఓ 'X'లో పోస్ట్ చేసింది.