Modi Reaction On Pahalgam terror attack: చావు ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఎంత ఊహించుకున్నా అంతకు మించి ఉంటుందని ఉగ్రవాదులకు ప్రధానమంత్రి మోదీ వార్నింగ్ ఇచ్చారు. బిహార్‌లోని మధుబనిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించారు. ఈ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 22న జరిగన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌తో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగించే ముందు పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. వారి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఇది కేవలం పర్యాటకులపై జరిగిన దాడి కాదని యావత్ దేశంపై జరిగిన దాడిగా మోదీ అభివర్ణించారు. ఈ దెబ్బతో ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపేసే టైం వచ్చిందని వార్నింగ్ ఇచ్చారు.
మోదీ మాట్లాడుతూ...." ఇవాళ ప్రపంచం మొత్తానికి చెప్తున్నా. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపేస్తాం. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని శిక్షలు వేస్తాం. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న నేతలను కూడా వదిలి పెట్టం. ఒక్కొక్కడిని వెంటాడి వేటాడి చంపుతాం. కనీసం వాళ్లు కలలో కూడా ఆ చావు ఊహించి ఉండరు. బిహార్ మట్టి మీద ఒట్టేసి చెబుతున్నా." అని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
"అందర్నీ శిక్షిస్తాం"ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతూ, "ఏప్రిల్ 22న కాశ్మీర్‌లో ఉగ్రవాదులు అమాయక ప్రజలను చంపడం చాలా బాధాకరం. బాధిత కుటుంబాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుంది. ఈ దాడిలో ఒకరు తన కొడుకును కోల్పోయారు. మరొకరు తన సోదరుడిని కోల్పోయారు. మరొకరు తన జీవిత భాగస్వామిని కోల్పోయారు."
"ఈ దాడి చేసిన వారికి వారు ఊహించని కఠినమైన శిక్ష పడుతుందని నేను చెబుతున్నాను. ఇప్పుడు ఉగ్రవాదుల మిగిలిన స్థావరాలు కూడా నాశనం అవుతాయి. ఉగ్రవాద సూత్రధారుల వెన్నెముక విరిచేస్తాం. ప్రతి ఉగ్రవాది కచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు."