Prime Minister Modi meets Pahalgam Terror Victims  Family:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (మే 30, 2025) కాన్పూర్ పర్యటనలో భాగంగా పహల్గాం ఉగ్రవాద దాడిలో మరణించిన వ్యాపారి శుభం ద్వివేదీకి చెందిన కుటుంబ సభ్యులను కలిశారు. ప్రధానమంత్రి మోదీని కలిసిన తర్వాత శుభం ద్వివేదీ భార్య అయిన ఆశాన్య ద్వివేదీ మాట్లాడుతూ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం ఇంకా ముగియలేదని ప్రధానమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.

ఆశాన్య ద్వివేదీ మాట్లాడుతూ, "ప్రధానమంత్రి మోదీ మాతో మొత్తం దేశం, ప్రభుత్వం అండగా ఉందని అన్నారు. ఆయన చాలా బాధపడ్డారు, పహల్గాం ఉగ్రవాద దాడి రోజు ఏం జరిగిందో  నన్ను అడిగారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం ముగియలేదని ఆయన అన్నారు. మళ్ళీ కలుస్తానని ఆయన హామీ ఇచ్చారు" అని తెలిపారు.

ప్రధానమంత్రి మోదీని కలిసిన తర్వాత శుభం ద్వివేదీ తండ్రి సంజయ్ ద్వివేదీ మాట్లాడుతూ, "పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక ఆపరేషన్ ప్రారంభించారు, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద కేంద్రాలను నాశనం చేసినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేశాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో మొత్తం దేశం ప్రధానమంత్రితో ఉంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని ప్రధానమంత్రి మోదీ మాకు చెప్పారు. ప్రధానమంత్రి మోదీ కూడా భావోద్వేగానికి లోనయ్యారు" అని అన్నారు.

కాన్పూర్ ఎంపీ రమేష్ అవస్థి ఒక వారం క్రితం ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసి, పహల్గాం ఉగ్రవాద దాడిలో మరణించిన శుభం ద్వివేదీ కుటుంబాన్ని కలవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఆయన రిక్వస్ట్ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కాన్పూర్‌లోని చాకేరి విమానాశ్రయంలో పహల్గామ్ ఉగ్రవాద బాధితుడు శుభం ద్వివేది కుటుంబాన్ని కలిశారని వార్తా సంస్థ పిటిఐ రిపోర్టు చేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మందిలో ద్వివేది కూడా ఉన్నారు.

"పీఎంఓ నిర్ణయం గురించి మృతుల కుటుంబ సభ్యులకు ముందే తెలియజేశాం. ప్రధాని మోదీ తన ప్రత్యేక విమానం దిగిన వెంటనే విమానాశ్రయంలో శుభం భార్య అశాన్య, ద్వివేదీ తల్లిదండ్రులు సంజయ్ ద్వివేది, సీమా ద్వివేదిని కలుస్తారు" అని కాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ జితేంద్ర ప్రతాప్ సింగ్ ముందుగా వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 12న వివాహం చేసుకున్న ద్వివేది తన భార్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పహల్గామ్‌ను సందర్శిస్తుండగా, ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరపడంతో ఆయన మరణించారు. ఏప్రిల్ 24 ఉదయం పూర్తి ప్రభుత్వ గౌరవాలతో ఆయన స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ మంత్రులు యోగేంద్ర ఉపాధ్యాయ్, రాకేష్ సచన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.