PM Modi Meeting CMs: అంతర్జాతీయంగా పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకున్న అనిశ్చితి వల్ల భారత్‌లో సప్లై చెయిన్ దెబ్బతినకుండా, సామాన్యులపై భారం పడకుండా ఉండటమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది.
కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
సమీక్షా సమావేశంలో ప్రధానమంత్రి మోదీ ప్రదానంగా నిత్యావసరాల నిల్వ, కృత్రిమ కొరత సృష్టించి లాభపడేవారిపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు స్ఫష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సప్లై చెయిన్‌లో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని, రాష్ట్ర , జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లను యాక్టివేట్ చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పరిపాలనాపరంగా అత్యంత అప్రమత్తంగా ఉంటూ, మార్కెట్‌లో నిత్యావసరాల లభ్యతను నిర్దారించాలని ఆయన కోరారు.
వ్యవసాయ రంగంపై ముందస్తు వ్యూహం
రాబోయే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడటం ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్రధాని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎరువుల నిల్వ, పంపిణీ విషయంలో ముందస్తు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని రాష్ట్రాలను కోరారు. మార్చి 3 నుంచి నిరంతరం పని చేస్తున్న ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ పరిస్థితులను రోజువారీగా సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన వెల్లడించారు.
ఇంధన భద్రత- ప్రత్యామ్నాయ మార్గాలు
దేశ ఇంధన అవసరాల కోసం విదేశాలై ఆధారపడడాన్ని తగ్గించే దిశగా ప్రధాని పలు సూచనలు చేశారు. బయో ఫ్యూయల్స్, సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి రంగాల్లో రాష్ట్రాలు తమ ప్రయత్నాలను వేగవంతం చేయాలి. పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ల విస్తరపై దృష్టి పెట్టాలి. చమురు, నేచురల్ గ్యాస్ కోసం దేశీయంగా అన్వేషణను పెంచడంలో రాష్ట్రాలు సహకారం అందించాలని ప్రధాని కోరారు.
రాష్ట్రాల స్పందన
ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరా స్థిరంగా ఉందని భరోసా ఇచ్చారు. ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం సామాన్యులకు గొప్ప ఊరటనిస్తుందని వారు హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా వాణిజ్య ఎల్పీజీ కోటాను సంక్షోభం ముందున్న స్థాయిలో 50 శాతం నుంచి 70 శాతానికి పెంచడానికి కూడా రాష్ట్రాలు స్వాగతించాయి.
