థింఫు: ఢిల్లీ కారు పేలుడులో మరణించిన 12 మందికి న్యాయం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ దాడిని చాలా తీవ్రంగా పరిగణిస్తోందని, బాధ్యులైన వారందరినీ అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషాద ఘటనపై ప్రధాని మోదీ తొలిసారిగా మాట్లాడారు. ఎర్రకోట సమీపంలో జరిగిన దాడి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలు నిందితుల కుట్రను ఛేదించి, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నారు.

Continues below advertisement

ప్రధాని మోదీ రెండు రోజుల పాటు పర్యటనలో భాగంగా భూటాన్ వెళ్లారు. రాజధాని థింఫులో జరిగిన కార్యక్రమంలో  "ఈ రోజు చాలా బాధతో ఇక్కడికి వచ్చాను. నిన్న (సోమవారం) సాయంత్రం ఢిల్లీలో జరిగిన భయంకరమైన సంఘటన అందరినీ తీవ్రంగా కలిచివేసింది. బాధితుల కుటుంబాల బాధను అర్థం చేసుకున్నాను. యావత్ దేశం బాధితులకు అండగా నిలుస్తుంది. నిన్న రాత్రి అంతా ఈ సంఘటనను దర్యాప్తు చేస్తున్న అన్ని ఏజెన్సీలతో నేను టచ్‌లో ఉన్నాను. మన ఏజెన్సీలు త్వరలోనే ఈ దాడి కుట్రను ఛేదిస్తాయి. దీని వెనుక ఉన్న కుట్రదారులు ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బాధ్యులైన వారందరినీ న్యాయస్థానానికి తీసుకువచ్చి శిక్ష పడేలా చేస్తాం" అని అన్నారు.

సమగ్ర దర్యాప్తు చేసి, వివరాలు వెల్లడిస్తాం.. రాజ్‌నాథ్ సింగ్

ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడుపై అగ్ర దర్యాప్తు సంస్థలు "వేగంగా, సమగ్రంగా" దర్యాప్తు చేస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం నాడు చెప్పారు. ఆ దాడి వెనుక ఉన్న వారిని అరెస్ట్ చేసి, శిక్షపడేలా చేస్తామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామన్నారు. మనోహర్ పరికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ (MP-IDSA)లో జరిగిన "ఢిల్లీ డిఫెన్స్ డైలాగ్"లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. 12 మంది మరణానికి కారణమైన పేలుడు ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

"నిన్న ఢిల్లీలో జరిగిన విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. దేశంలోని ప్రముఖ దర్యాప్తు సంస్థలు ఈ సంఘటనపై వేగంగా, వివరంగా విచారణ జరుపుతున్నాయని నేను హామీ ఇస్తున్నాను. త్వరలో దాడికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తాం. ఢిల్లీలో ఈ విషాదానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం" అని అన్నారు.

నవంబర్ 10న సాయంత్రం 6:52 గంటలకు ఎర్రకోట సమీపంలో ఓ హ్యుందాయ్ i20లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలు కార్లు, బైక్స్ ధ్వంసమయ్యాయి. నిన్న 9 మంది చనిపోగా, మంగళవారం మరో ముగ్గురు చనిపోయారు. దాంతో మృతుల సంఖ్య 12కి చేరింది.