New Parliament Building: భారతదేశ చరిత్రలో మరో చారిత్రాత్మక ఆవిష్కృతమైంది. నూతన పార్లమెంట్‌లోకి ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంట్ సభ్యులు ప్రవేశించారు. దీనికి ముందుగా మంగళవారం ఉదయం లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాత పార్లమెంట్ భవనం ముందు ఫొటో సెషన్ జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, ఎంపీలు ఫొటోలు దిగారు. ముందుగా ప్రధాని మోదీ రాగా, ఎంపీలు ఆయన్ను అనుసరించారు.
పార్లమెంట్ సభ్యుల గ్రూప్ ఫొటో సందర్భంగా బీజేపీ ఎంపీ నరమరి అమిన్ నీరసంతో కూప్పకూలిపోయారు. అనంతరం, సభ్యులు సపర్యలు చేయడంతో లేచి కూల్చున్నారు. అనంతరం ఫొటో సెషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరగా పాత పార్లమెంట్‌లో సభ్యులకు ప్రధాని మోదీ అభివాదం చేశారు. పార్లమెంట్ పాత భవనం శకం సోమవారం సమావేశాలతో ముగిసింది. మంగళవారం నుంచి కొత్త భవనంలోనే పార్లమెంట్ సమావేశాలు నడుస్తాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
కొత్త భవనానికి పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియాగా నామకరణం
కొత్త పార్లమెంట్ భవనానికి "పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా"గా నామకరణం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసింది. కొత్త పార్లమెంట్ భవనంలో ఉదయం గణపతి పూజ జరుగుతుందని సమాచారం. ఆపై మధ్యాహ్నాం 1.15 నిమిషాలకు లోక్‌సభ ప్రారంభం కానుంది. మరోవైపు రాజ్యభస 2.15 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. సాయంత్రం 4 గంటలకు స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరుగనుంది.
సభ్యులకు కానుకలు
ప్రత్యేక సమావేశాల సందర్భంగా పార్లమెంట్ సభ్యులు తొలిసారి నూతన భవనంలో అడుగుపెట్టనున్నారు. ఈ విశిష్ట సందర్భానికి గుర్తుగా పార్లమెంట్ సభ్యులకు కేంద్రం ప్రత్యేక కానుకలు అందజేయనున్నట్లు తెలుస్తోంది. జనపనారతో రూపొందించిన బ్యాగులో భారత రాజ్యాంగ ప్రతి, పాత, కొత్త పార్లమెంటు భవనాల చిత్రాలతో కూడిన స్టాంపులు, స్మారక నాణెం వారికి ఇవ్వనుంది. ఇక, ఆ బ్యాగులపై ఎంపీల పేర్లు రాసి ఉన్నాయి. ప్రధాని మోదీ సైతం పాత పార్లమెంట్ నుంచి కొత్త పార్లమెంట్‌కు రాజ్యాంగ ప్రతిని తన వెంట తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ప్రధానిని ఎంపీలు అనుసరించనున్నట్టు తెలుస్తోంది.