Parlakhemundi Light Railway Line: వాల్తేరు డివిజన్‌లోని చారిత్రక పర్లాకిమిడి రైల్వే లైను నూట పాతికేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వాల్తేరు డివిజన్ అధికారులు ఉత్సవాలు చేశారు. పిల్లలకు రకరకాల కాంపిటీషన్స్ నిర్వహించారు.పర్లాకిమిడి రైల్వే చరిత్ర ఇదే!

1898లో నౌపాడ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్లాకిమిడిని రైల్వేమార్గం ద్వారా కలపడం కోసం ఈ స్టేషన్ నిర్మించారు. పర్లాకిమిడి నేరోగేజ్ రైల్వేలైన్ అప్పటి పర్లాకిమిడి మహారాజు చంద్రగజపతి నారాయణ దేవ్ -2 తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. దీని కోసం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి తీసుకున్న గజపతి నారాయణ ఒడిశా ప్రాంతంలో మొట్టమొదటి ప్రైవేట్ రైల్వే లైన్‌గా పర్లాకిమిడి లైట్ రైల్వే (PLR )ని స్థాపించారు. 1900 ఏప్రిల్ 1 న ఈ లైన్‌పై మొదటి రైలు ప్రయాణించింది. 1931లో ఈ రైల్వేలైన్‌ని గుణుపూర్ వరకు పొడిగించారు. మరో మూడు ఏళ్ల తర్వాత బెంగాల్- నాగపూర్ రైల్వే ఈ ట్రాక్ మేనేజ్మెంట్‌ని పరిధిలోకి తీసుకుంది. ప్రస్తుతం ఈ నౌపడ గుణుపూర్ లైన్ టెక్కలి, పెద్దసన, తెంబూరు, గంగువాడ, పాతపట్నం, పర్లాకిమిడి, కాశీనగర్, లిహురి, బంశధార, పాలసింగ్ లాంటి పది ముఖ్యమైన స్టేషన్‌ల గుండా సాగుతుంది.

బ్రాడ్‌గేజ్‌లోకి మారిపోయిన పర్లకిమిడి రైల్వేలైన్ పెరుగుతున్న ప్రయాణికులను రద్దీ దృష్ట్యా పర్లాకిమిడి రైల్వేలైన్‌ని 2010 నాటికి బ్రాడ్‌గేజ్‌గా మార్చారు. ప్రస్తుతం అమృత్ భారత్ పథకం కింద చారిత్రక పర్లాకిమిడి స్టేషన్‌ను డెవలప్ చేస్తున్నారు. 

అరకు రూటును మించిన అందాలువిశాఖపట్నం నుంచి గుణుపూర్ వెళ్లే ట్రైన్ ప్రతిరోజు ఉదయం 5:30కి బయలుదేరుతుంది. విశాఖ- కిరండోల్ ట్రైన్‌లో అరకు వెళ్లేటప్పుడు మనం ఎలాంటి ప్రకృతి అందాలు చూస్తామో దాన్ని మించిన అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని పర్లాకిమిడి గుండా వెళ్లే విశాఖ-గుణపూర్ ట్రైన్‌లో ప్రయాణిస్తూ చూడొచ్చు. అయితే అరకు టైపులో ఈ ఏరియా పెద్దగా పాపులర్ కాలేదు. టూరిజం డిపార్ట్మెంట్ దృష్టి పెడితే ఈ మార్గానికి పర్యాటకుల సందడి పెరుగుతుంది. ఇక చారిత్రిక పర్లాకిమిడి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తి అవుతాయని వాల్తేరు డిఆర్ఎం లలిత్ బోహ్ర తెలిపారు.