Pariksha Pe Charcha 2026: మార్కులు ముఖ్యమా లేక స్కిల్స్ పెంచుకోవాలా? పరీక్షా పే చర్చాలో ప్రధాని మోదీ రియాక్షన్ వైరల్
PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎగ్జామ్ ఫీవర్ మొదలైంది. దాంతో పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్ రెండో ఎపిసోడ్‌లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో విద్యార్థులు మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోదీ బదులిచ్చారు. మార్కులు లేదా స్కిల్స్ ముఖ్యమా అనే దానిపై తరచుగా చర్చ జరుగుతుందని.. జీవితంలో ఒకే విషయంపై దృష్టి పెట్టలేమని ప్రధాని మోదీ అన్నారు. విద్యార్థులు మార్కులతో పాటు స్కిల్స్, ఏ విషయంపై అయినా ఆసక్తి పెంచుకోవడం లాంటి 3 విషయాలు ఏకకాలంలో అభివృద్ధి చేసుకోవడం చాలా అవసరం అన్నారు. అయితే ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకోవాలన్న ప్రధాని.. పరీక్షలను తమ అంతిమ లక్ష్యంగా చేసుకోవద్దని సూచించారు. బేసిక్స్ మీద పట్టు సాధిస్తే విషయం తేలికగా అర్థమవుతుందన్నారు.
విద్యార్థుల నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ఎందుకంటే ఇది క్లాసులు తీసుకునే ప్రోగ్రాం కాదని, నేర్చుకునే సమయం అన్నారు. ఈ సంవత్సరం పరీక్షా పే చర్చ కార్యక్రమం గత సంవత్సరాలతో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంది. ఈసారి దేశంలోని వివిధ ప్రాంతాల విద్యార్థులతో మాట్లాడానని ప్రధాని మోదీ ఇటీవల తెలిపారు. విద్యార్థుల తెలివితేటలు, ఆలోచనా శక్తి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని మోదీ కితాబిచ్చారు. ప్రధాని మోదీని చాలా సింపుల్‌గా, డౌన్ టు ఎర్త్‌గా చూశామని విద్యార్థులు తెలిపారు.
విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, తాను గత కొన్ని సంవత్సరాలుగా 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులతో మాట్లాడటం ద్వారా కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. ఇది చాలా విషయాలు నేర్చుకునే కార్యక్రమం, టీచింగ్ చేసే ఈవెంట్ కాదన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన యువకులను కలవడానికి కారణం, నేను కూడా ఏదైనా నేర్చుకోవాలనే తాపత్రయం అన్నారు. ఒక విద్యార్థిని మాట్లాడుతూ, తాను ఒక స్టార్టప్ ప్రారంభించాలని ఆలోచిస్తున్నానని, చదువు పరంగా తాను ఏమి చేయాలి అని అడిగింది.
#WATCH | PM Narendra Modi interacts with students during the 9th edition of 'Pariksha pe Charcha'.
— ANI (@ANI) February 9, 2026
He says, "... One should always have confidence in oneself... We should observe and improvise according to the situation..."
Source: DD pic.twitter.com/vGyISAOQno
దీనిపై ప్రధాని మోదీ మాట్లాడుతూ, మీరు ఏమి చేయాలనుకుంటున్నారో దానిపై ఫోకస్ చేయాలి. స్టార్టప్ ప్రారంభించేందుకు 25 సంవత్సరాల వయస్సు ఉండాలని కండీషన్ ఏమీ లేదు. మీరు ఎప్పుడైనా స్టార్టప్ పెట్టవచ్చు. ఏదైనా స్టార్టప్ నడుపుతున్న వ్యక్తిని కలిసి, మీ ప్రాజెక్ట్ నివేదికను తయారు చేయాలి. అప్పుడే రియల్ టైంలో సమస్యలపై అవగాహనా వస్తుందన్నారు.
చదువు, అభిరుచి మధ్య బ్యాలెన్స్ ఎలా?
మరొక విద్యార్థి మాట్లాడుతూ, నేను చదువుపై ఎక్కువ ఫోకస్ చేస్తే, నా గోల్ చేరుకోలేనేమో.. ఒకవేళ నా అభిరుచులపై ఫోకస్ చేస్తే చదువులో వెనుకబడి పోతానని భయంగా ఉంది. రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించడం సాధ్యమేనా అని మోదీ అడిగారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ రెండూ ఉపయోగకరమేనని అన్నారు. మీకు కళల పట్ల ఆసక్తి ఉంటే, మీరు సైన్స్ సబ్జెక్ట్ చదివితే, అందులో ల్యాబ్ గురించి చర్చ ఉంటే, కాగితంపై పెయింటింగ్ వేసి ల్యాబ్ క్రియేట్ చేయాలి. ప్రతి సీసాపై కెమికల్ పేరు రాయండి. అప్పుడు మీరు మరొక చిత్రాన్ని తయారు చేసి, ప్రతిచర్య కలిగిన రంగును గీయాలి. ఇప్పుడు మీ ఆర్ట్ పని పూర్తవుతుంది, అదే సమయంలో మీ పాఠం బాగా గుర్తుండిపోతుంది. అలసటను తగ్గించడంలో కూడా మీ అభిరుచులు దోహదం చేస్తాయన్నారు.
#WATCH | PM Narendra Modi interacts with students during the 9th edition of 'Pariksha pe Charcha'.
— ANI (@ANI) February 9, 2026
He says, "... Tribal communities of India enrich its progress and conserve its environment..."
Source: DD pic.twitter.com/J379ecdvhq
2047 వికసిత్ భారత్ కోసం విద్యార్థులు ఏం చేయాలి..
మరొక విద్యార్థిని మాట్లాడుతూ, మన దేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా నిలవనుంది. యువకులు దీన్ని సాధించడానికి ఏమి చేయాలి? అని అడిగింది. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశంలోని 10వ తరగతి, 12వ తరగతి పిల్లల మనస్సులో కూడా 2047 అభివృద్ధి చెందిన భారత్ అనే కల ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు సింగపూర్ గురించి వినే ఉంటారు. ఒకప్పుడు అది మత్స్యకారుల చిన్న గ్రామం. అక్కడి నుంచి అది ఇంత పెద్దదిగా ఎలా ఎదిగిందో మనం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే, అలాంటి అలవాట్లు అలవర్చుకోవాలి. ఎక్కడైనా ఉమ్మివేయడం, చెత్త వేయడం చేయకూడదు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలి. ఆహారం వేస్ట్ చేయకూడదు. వోకల్ ఫర్ లోకల్స్‌పై దృష్టి పెట్టి దేశంలో తయారైన వస్తువులను కొనాలని సూచించారు.
తమిళనాడు తర్వాత ఛత్తీస్‌గఢ్ విద్యార్థులతో మాట్లాడారు
కోయంబత్తూరు తర్వాత ప్రధాని రాయ్‌పూర్ చేరుకున్నారు. ఇక్కడ ఆయన రాష్ట్ర సాంప్రదాయ ఆహారాన్ని తీసుకున్నారు. ఇక్కడ ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ, మనం ఎక్కడికి వెళ్లినా విద్యార్థులుగా వెళ్ళాలి. భారత్ ఎన్నో వైవిధ్యాలతో నిండి ఉంది. వాటిని చూసేందుకు ఒక్క జీవితం మనకు సరిపోదు. ఒక విద్యార్థిని మాట్లాడుతూ, పరీక్ష సమయంలో కొన్నిసార్లు పునఃసమీక్ష చేయలేకపోతున్నాం. దీనివల్ల కొంచెం అసౌకర్యంగా ఉంటుంది, కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి ? అని అడిగింది.
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మీరు విన్నది, చదివింది వృధా కాలేదని, అది ఎక్కడో మీ మెదడులో ఉండిపోయిందని మొదట భావించండి. మంచి విద్యార్థి కావాలంటే ఆ సబ్జెక్ట్‌పై పట్టు ఉండాలన్నారు. ఒక విద్యార్థిని పర్యావరణం గురించి మాట్లాడుతూ, పర్యావరణ అభివృద్ధి వైపు వెళుతున్నాం, కాబట్టి మనం ఆ దిశలో ఏమి చేయాలి? అని అడిగారు. మోదీ స్పందిస్తూ.. ప్రకృతి వనరులను కాపాడటం మన స్వభావంలో ఉండాలి. నెమ్మదిగా ప్రజలను అందులో భాగస్వాములు చేస్తూ ఉంటే మార్పు వస్తుంది. మీరు బ్రష్ చేసుకుంటుంటే ట్యాప్ ఆపివేయండి. నీరు వృధా చేయవద్దు. ఈ చిన్న చిన్న పనుల ద్వారా మనం పర్యావరణానికి మేలు చేసిన వాళ్లం అవుతామని విద్యార్థులకు మోదీ సూచించారు.
ఛత్తీస్‌గఢ్ నుంచి ప్రధాని గుజరాత్‌కు చేరుకున్నారు
ఛత్తీస్‌గఢ్ నుంచి ప్రధాని మోదీ గుజరాత్‌లోని దేవ్ మొగ్రాకు చేరుకున్నారు. ఇక్కడ ఆయన గిరిజన పిల్లలను కలిశారు. ఒక విద్యార్థి మాట్లాడుతూ, మీరు రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం చాలా పని చేశారని చెప్పారు. దీనికి మీకు ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? అని అడిగాడు. మోదీ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి జన్-ధన్ యోజన ప్రారంభించామని చెప్పారు. గిరిజన సమాజంలో చాలా మంది వెనుకబడి ఉన్నారు. వారి కోసం ప్రత్యేక పథకం రూపొందించాం. అప్పటి నుంచి విద్యపై మరింత ఫోకస్ చేయాలనిపించింది. చదువుపై ఎంత ఎక్కువ దృష్టి పెడితే అంత వేగంగా పలు రంగాల్లో అభివృద్ధి చెందుతామని అన్నారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో మీరు మీ ఒత్తిడిని ఎలా నియంత్రించుకున్నారు? మేము పరీక్ష ఒత్తిడితోనే భయపడతాము. ప్రధాని మోదీ మాట్లాడుతూ, మీరు పాత పరీక్ష రోజులను గుర్తుంచుకోండి. పరీక్షకు ముందు మీపై ఒత్తిడి ఉంటుంది. కానీ పరీక్ష రాసిన తర్వాత ఎలాంటి ఒత్తిడి ఉండదు. పరీక్షకు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు పేపర్‌ను సాల్వ్ చేసే అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ ఎగ్జామ్ కోసం సిద్ధమవుతుంటే, ఖచ్చితంగా మీకు ఒత్తిడి ఉండదు. బాగా నిద్రపోవాలి. చిన్న విజయానికి ప్రభావితం కావద్దు. గొప్ప వ్యక్తుల జీవితాలు సాధరణ దశ నుంచే మొదలయ్యాయని నేర్చుకోవాలని సూచించారు.
గువాహటిలో పరీక్షా పే చర్చ
చివరగా, ప్రధానిమోదీ అస్సాంలోని గౌహతికి చేరుకున్నారు. ఇక్కడ ఆయనకు గమ్చా ఇచ్చి స్వాగతం పలికారు. ఒక విద్యార్థి ప్రధానిని శక్తిని పొందడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలని అడిగాడు. ప్రధాని మాట్లాడుతూ, నా ఆహారానికి ఎలాంటి సిస్టమ్ లేదు. మెడిసిన్ లాగ ఆహారం తీసుకోకూడదని ఆయన అన్నారు.
























