Parents permission For love: గుజరాత్‌లో ఇకపై ప్రేమ వివాహం చేసుకోవడం అంత సులువు కాదు. ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకుని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుందామనుకునే ప్రేమికులకు గుజరాత్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వివాహ రిజిస్ట్రేషన్ చట్టానికి చేసిన తాజా సవరణల ప్రకారం, పెళ్లి చేసుకోబోయే జంట తాము ఈ విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామో లేదో అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. అంతేకాదు, వారి ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్లు , అడ్రస్ వివరాలను రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించడం తప్పనిసరి చేశారు.
ఈ కొత్త నిబంధనల్లో అత్యంత కీలకమైన అంశం తల్లిదండ్రులకు నోటీసు . జంట దరఖాస్తు చేసుకున్న 10 వర్కింగ్ డేస్‌ల్లో, రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి వారి తల్లిదండ్రులకు వాట్సాప్, ఎస్సెమ్మెస్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా సమాచారం వెళ్తుంది. అంటే, ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవాలనుకునే వారి గుట్టును ప్రభుత్వమే నేరుగా తల్లిదండ్రులకు విప్పుతుందన్నమాట. సనాతన సంప్రదాయాలను రక్షించేందుకు , మోసపూరిత వివాహాలు అంటే లవ్ జిహాద్ వంటివి అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వి చెబుతున్నారు.
మరో ముఖ్యమైన మార్పు 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ . దరఖాస్తు చేసుకున్న వెంటనే పెళ్లి సర్టిఫికేట్ రాదు. కనీసం 30 రోజుల పాటు వేచి ఉండాలి. ఈ గడువులోగా పెళ్లికి సంబంధించి ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే, వాటిని అధికారులు పరిశీలిస్తారు. అలాగే, పెళ్లి ఫోటోలు, వివాహ ఆహ్వాన పత్రిక , సాక్షుల వివరాలను కూడా ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే, ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మైనార్టీ దాటినా తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛను ఈ చట్టం హరిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని హక్కుల కార్యకర్తలు విమర్శిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రమేయం పెంచడం వల్ల ప్రేమ జంటలపై దాడులు , వేధింపులు పెరిగే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ ముసాయిదాపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్న ప్రభుత్వం, త్వరలోనే దీనిని పూర్తిస్థాయి చట్టంగా అమలు చేయనుంది.
