న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళన సమయంలో పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. ఇదే అదనుగా భావించి భారత సరిహద్దులో పాకిస్తాన్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. దాంతో దాయాది పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లయింది. జమ్మూకశ్మీర్ లోని అంతర్జాతీయ సరిహద్దులో బీఎస్ఎఫ్ పోస్ట్ (BSF Post)పై పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే స్పందించిన భారత బలగాలు పాక్ రేంజర్ల కాల్పులను తిప్పికొట్టాయి. బీఎస్ఎఫ్, పాకిస్థాన్ రేంజర్ల మధ్య దాదాపు 20 నిమిషాల పాటు కాల్పులు జరిగాయని బుధవారం రాత్రి పీటీఐ రిపోర్ట్ చేసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






బుధవారం సాయంత్రం దాదాపు 6 గంటల ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వెంట, జమ్మూలోని బీఎస్ఎఫ్ పోస్ట్‌పై పాకిస్తాన్ రేంజర్లు కాల్పులు జరిపారు. అనంతరం భారత బలగాలు అంతేదీటుగా ఎదురుకాల్పులు జరిపి పాక్ రేంజర్ల ఆటకట్టించినట్లు పీటీఐ స్పష్టం చేసింది. 






చివరగా నవంబర్ 2023లో కూడా పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అంతకుముందు పలుమార్లు పాక్ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడి మూల్యం చెల్లించుకుంది. గతేడాది నవంబర్‌లో జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లా రామ్‌గఢ్ సెక్టార్‌లో పాక్ రేంజర్లు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ బీఎస్ఎఫ్ జవాన్ వీరమరణం పొందాడని తెలిసిందే. పాక్ అవకాశం దొరికినప్పుడల్లా భారత సరిహద్దు వెంట కాల్పులు జరిపి.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. దాదాపు ఇరవై ఏళ్ల కిందట చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి రెండు దేశాలు కాల్పులు ఆపాలని ఫిబ్రవరి 2021లోనూ నిర్ణయం తీసుకున్నాయి.