Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి భారతీయల తరలింపు కొనసాగుతోంది. ‘ఆపరేషన్ అజయ్’లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి 235 మంది భారతీయులతో రెండవ విమానం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికారు. ఉగ్రవాద సంస్థ హమాస్‌తో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన రెస్క్యూ మిషన్ ‘ఆపరేషన్ అజయ్’.
ఇజ్రాయెల్ పట్టణాలపై హమాస్ దాడులు చేస్తున్న నేపథ్యంలో భారతీయులను తరలించేందుకు భారత్ గురువారం 'ఆపరేషన్ అజయ్' ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భాగంగా రెండో విమానం శుక్రవారం సాయంత్రం ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్ నుంచి బయలుదేరింది. దీనిపై విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. ‘విదేశాల్లోని మన జాతీయుల భద్రత, శ్రేయస్సుకు భారతదేశం పూర్తిగా కట్టుబడి ఉంది’ అని అన్నారు. శుక్రవారం ఉదయం 212 మంది భారతీయులతో మొదటి విమానం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే.
ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి భారత్ ‘ఆపరేషన్ అజయ్’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇజ్రాయిల్ నుంచి 212 మంది భారతీయులతో కూడిన AI1140 విమానంలో శుక్రవారం న్యూఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. వారికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
భారతీయుల తరలింపుపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ప్రస్తుతానికి చార్టర్ విమానాలను ఉపయోగిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. అవసరమైతే వైమానిక దళాన్ని కూడా ఉపయోగించుకుంటామని అన్నారు. ఇజ్రాయిల్‌లో నివసిస్తున్న మన భారతీయ పౌరులు త్వరలో రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. దాదాపు 18,000 మంది భారతీయులు ఇజ్రాయిల్‌లో ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది విద్యార్థులే ఉన్నట్లు తెలుస్తోంది.
మందుగా పేర్లు రిజిస్టర్ చేసుకున్న వారిని తొలుత భారత్ తరలించినట్లు చెప్పారు. అక్టోబర్ 7న ఎయిర్ ఇండియా తన విమానాలను నిలిపివేసింది. తిరిగి వచ్చే వారు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని.. వారి రిటర్న్ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యుద్ధం కారణంగా ఇప్పటి వరకు భారతీయులెవరూ గాయపడినట్లు తమకు సమాచారం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఏపీ భవన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
ఆపరేషన్ అజయ్'లో భాగమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగమైంది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇజ్రాయిల్ నుంచి భారత్ కు తరలిస్తున్న భారతీయుల్లో ఆంధ్రప్రదేశ్ వాసులకు సహాయం చేసేందుకు ఈ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. అవసరమైన వారికి ఢిల్లీ నుంచి తమ స్వస్థలాలకు చేరేందుకు ప్రయాణ ఏర్పాట్లను ఏపీ భవన్ అధికారులు చేస్తున్నారు. ఇజ్రాయిల్ నుంచి ఢిల్లీ వరకు 'ఆపరేషన్ అజయ్' పేరుతో భారతీయులను కేంద్ర ప్రభుత్వం తరలిస్తోంది. రెండో విమానంలో ఏపీ కి చెందిన 5-6 మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. వారికి ఏపీ భవన్‌లో భోజన, వసతి సదుపాయాలు కల్పించారు. అనంతరం విమాన ప్రయాణ ఏర్పాట్లు చేశారు.