PM Modi Takes Lion Safari: గిర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ప్రధాని మోదీ లయన్ సఫారీ, ఆయన కొత్త టాలెంట్ చూశారా!
PM Modi Visits Gir National Park | ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్కును సందర్శించారు. గిర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీలో సింహాల ఫొటోలు క్లిక్ మనిపించారు.

PM Modi Goes On Lion Safari At Gir National Park | అహ్మదాబాద్: మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఉన్నారు. నేడు (మార్చి 3న) ప్రపంచ వణ్యప్రాణి దినోత్సవం (World Wildlife Day) సందర్భంగా జునాగఢ్ జిల్లాలోని గిర్ సఫారీకి ప్రధాని మోదీ వెళ్లారు. ఆసియా సింహాలకు నిలయం గిర్ వణ్యప్రాణి సంరక్షణ కేంద్రమని తెలిసిందే. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా గిర్ వణ్యప్రాణి సంరక్షణ కేంద్రానికి (Gir Wildlife Sanctuary) వెళ్లానని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన శ్రమకు ఫలితం కనిపిస్తుందన్నారు. చాలా కాలం నుంచి చేస్తున్న సమిష్టి ప్రయత్నాలు ఫలించి ఆసియా సింహాల జనాభా క్రమంగా పెరిగిందని తెలిపారు. ఈ ఆసియా సింహాల ఆవాసాలను కాపాడడంలో గిరిజనులు, అక్కడి మహిళల పాత్ర కూడా కీలకమని ప్రధాని మోదీ ప్రశంసించారు.
ప్రధాని మోదీ టాలెంట్ చూశారా..
గిర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీకి వెళ్లిన సందర్భంగా అటవీశాఖ అధికారులతో కలిసి ప్రధాని మోదీ లయన్ సఫారీ చేశారు. వన్య ప్రాణాలను కాపాడుకుందామని పిలుపునిచ్చిన ప్రధాని మోదీ లయన్ సఫారీ చేస్తూ తన కెమెరాకు పని చెప్పారు. సింహాల ఫొటోలను క్లిక్ మనిపిస్తూ తన టాలెంట్ చూపించారు. వన్య ప్రాణాల సంరక్షణ కేంద్రంలో వాహనంలో తిరుగుతూ సింహాల ఫొటోలు తీశారు. అనంతరం తన ఎక్స్ ఖాతాలో తాను తీసిన ఫొటోలను ప్రధాని మోదీ షేర్ చేసుకున్నారు.
గత దశాబ్దంలో దేశంలో పులులు, చిరుతలతో పాటు ఖడ్గమృగాల సంఖ్య కూడా పెరిగింది. మనం వన్యప్రాణులపై చూపుతున్న ఆసక్తి ఏంటన్నది ఇది సూచిస్తుంది. వన్య ప్రాణులకు స్థిరమైన ఆవాసాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తుంది, ఏ చర్యలు చేపట్టిందో గణాంకాలు సూచిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వీలైతే ప్రతి ఒక్కరూ గిర్ వన్య ప్రాణాల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి, ఆస్వాదించాలని సూచించారు.
భూమి మీద జీవవైవిధ్యాన్ని పెంపొందించడానికి, వన్య ప్రాణుల్ని సంరక్షించడానికి నిబద్ధతతో వ్యవహరించాలి. ప్రతి జీవ జాతి ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. మనం రాబోయే తరాలకు మరింత జీవ వైవిద్యాన్ని అందించి, వాటి భవిష్యత్తును కాపాడుకుందాం. వన్యప్రాణులను సంరక్షించడం, వాటి బాధ్యతలు నిర్వహించడంలో ప్రపంచంలో భారతదేశం కీలకపాత్ర పోషిస్తున్నందుకు గర్వంగా ఉందని ప్రధాని మోదీ పోస్ట్ చేశారు.