Nipah Virus: ప్రమాదకరమైన నిఫా వైరస్ మరోసారి కేరళలో కలకలం సృష్టిస్తోంది. కేరళ రాష్ట్రం కోజికోడ్ లో ఇద్దరు వ్యక్తులు అసహజ రీతిలో ప్రాణాలు కోల్పోవడంతో నిఫా వైరస్ భయాందోళనలు రేకెత్తాయి. దీంతో కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ, కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యాయి. అసహజ రీతిలో తీవ్రంగా జ్వరం వచ్చి ఇద్దరు మరణించడం వెనక నిఫా వైరసే కారణమని వైద్యాధికారులు ధ్రువీకరించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా కూడా నిఫా వైరస్ వల్లే వారిద్దరూ చనిపోయినట్లు ధ్రువీకరించారు. కోజికోడ్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ రెండు మరణాలు నమోదయ్యాయి. అనంతరం జరిగిన పరిశోధనలో నిఫా వైరస్ వల్లే చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు అధికారులు. పరిస్థితిని సమీక్షించడానికి నిఫా వైరస్ నిర్వహణలో కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయడానికి కేంద్ర బృందం రాష్ట్రానికి పంపించినట్లు మాన్‌సుఖ్ మాండవియా తెలిపారు.
నిఫా వైరస్ భయాందోళనలు వ్యక్తం కాగానే.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మృతి చెందిన వారితో సన్నిహితంగా ఉన్న వారు ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
తొలుత ఆగస్టు 30న 49 ఏళ్ల వ్యక్తి మరణించారు. తర్వాత సెప్టెంబరు 11న సోమవారం 40 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరూ కూడా జ్వరం, న్యుమోనియా లాంటి లక్షణాలతో బాధపడ్డారు. చనిపోయిన వారి నుంచి సేకరించిన నమూనాలను అధికారులు పరీక్షలకు పంపించారు. సంబంధిత ప్రాంతంలో తాము జ్వర సర్వే చేసినట్లు అధికారులు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తి ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ సీజన్‌లో తొలి జ్వరం రికార్డైందని వారు తెలిపారు.
2018 మే నెలలో తొలిసారిగా దక్షిణ భారతదేశంలో నిఫా వైరస్ వ్యాప్తి జరిగింది. అప్పుడు మొదటి కేసు కేరళలోని కోజికోడ్‌లో నమోదైంది. అప్పుడు సుమారు 17 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో రోగులకు చికిత్స అందించిన ఒక నర్సు కూడా చనిపోయారు. మళ్లీ 2021 లో కూడా కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ వ్యాపించి పలువురు మృత్యువాతపడ్డారు. ఇన్‌ఫెక్షన్ కారణంగా ఓ 12 ఏళ్ల బాలుడు చనిపోయిన ఘటన నమోదైంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిఫా వైరస్ సంక్రమణ అనేది జూనోటిక్ వ్యాధి. అంటే ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. కలుషితమైన ఆహారం లేదా నేరుగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాధి ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతారు. జ్వరం ఎక్కువగా వస్తుంది. మరణాల రేటు దాదాపు 70 శాతం ఉంటుందని డబ్ల్యుహెచ్‌ఓ వెల్లడించింది. ఈ వైరస్‌కు ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు.
నిఫా ఎలా వ్యాపిస్తుంది?
- ఫ్రూట్ బ్యాట్స్ (గబ్బిలాలు) లాలాజలం నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. అంటే ఎవరైనా ఈ గబ్బిలాలు కొరికిన పళ్లు తింటే ఈ వైరస్ శరీరంలోకి ఎంటర్ అవుతుంది.
- వైరస్ సోకిన ఏదైనా జంతువు బైట్ చేసిన ఫ్రూట్స్ తినడం వల్ల కూడా వైరస్ సోకుతుంది.
- నిఫా సోకిన పందులు కూడా వైరస్ కు ప్రధాన కారకాలని అంటున్నారు.
- వైరస్ సోకిన జంతువుతో డైరెక్ట్ కాంటాక్ట్ అయినా ఈ వైరస్ సోకే ప్రమాదముంది.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన వివరాల ప్రకారం.. వైరస్ సోకిన 4- 45 రోజుల్లోపు లక్షణాలు బయటపడే అవకాశం ఉంది.