New Parliament Building: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం అంగరంగ వైభోంగా సాగింది. 7.20కి కొత్త పార్లమెంట్ భవనానికి చేరుకున్న ప్రధానికి వేదపడింతులు స్వాగతం పలికారు. ప్రధాని మోదీతోపాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా హాజరయ్యారు. కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడానికి ముందు ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కొత్త పార్లమెంటు భవనంలో మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


కార్యక్రమం ప్రారంభంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రధాని మోదీకి పూజారులు సెంగోల్ ఇచ్చారు. అనంతరం ఆ సెంగోల్‌కు ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్ ను ప్రతిష్టించారు. ప్రత్యేక  పూజతో వేడుక ప్రారంభమైంది. సుమారు గంటపాటు ఈ పూజా కార్యక్రమాలు సాగాయి. 




కార్మికులను సన్మానించిన ప్రధాని మోదీ


కొత్త పార్లమెంటులో సెంగోల్ ను ఏర్పాటు చేసిన తరువాత, ప్రధాని మోడీ ఈ భవనాన్ని నిర్మించిన కార్మికులను కలుసుకున్నారు. వారిని సన్మానించారు. 




సెంగోల్ చరిత్ర..
సెంగోల్ ఓ తమిళ పదం. దీన్ని ఇంగ్లీష్‌లో Scepter అంటారు. అంటే...రాజదండం అని అర్థం. అప్పట్లో రాజులు సార్వభౌమత్వానికి చిహ్నంగా ఇది ధరించేవాళ్లు. 1947లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత అధికారాలను బదిలీ చేస్తూ  Lord Mountbatten తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకి ఇది అందజేశారు. దీని వెనకాల మరో కథ ఉంది. అది  భారత్‌కి స్వాతంత్య్రం వచ్చిన సమయం. భారత్‌కి పూర్తి అధికారాలు ఇస్తూ బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే...ఆ అధికారాలను ఎలా బదిలీ చేయాలో అర్థం కాలేదు. జవహర్‌ లాల్ నెహ్రూని లార్డ్ మౌంట్‌బట్టెన్ ఇదే ప్రశ్న అడిగారు. "బ్రిటీష్‌ నుంచి భారత్‌కు అధికారాలను ఎలా బదిలీ చేయాలి..? అని ప్రశ్నించారు. అప్పటి చివరి వైస్‌రాయ్ సీ. రాజగోపాలచారీ ( C. Rajagopalachari) అలియాస్ రాజాజీ (Rajaji)ని సలహా అడిగారు నెహ్రూ. "ఏం చేయాలో చెప్పండి" అని కోరారు. అప్పుడే రాజాజీ తీవ్రంగా ఆలోచించి ఓ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. చోళుల చరిత్రను ప్రస్తావించారు. చోళుల కాలంలో ఓ రాజు నుంచి మరో రాజుకి అధికారులు బదిలీ చేసే సమయంలో ఓ రాజదండాన్ని (Sengol) గుర్తుగా ఇచ్చేవారు. ఇదే విషయాన్ని రాజాజీ..నెహ్రూకి వివరించారు. వెంటనే మౌంట్‌బట్టెన్‌కి ఈ విషయం చెప్పిన నెహ్రూ...ఆయన నుంచి సెంగోల్‌ని స్వీకరించారు. అలా అధికారాలు బదిలీ అయ్యాయి. ఇదంతా పూర్తి తమిళ సంప్రదాయంలోనే జరిగింది. ఆ తరవాత దాన్ని అలహాబాద్‌లోని మ్యూజియంలో ఉంచారు. అప్పట్లో ఉమ్మిడి బంగారు చెట్టి అనే కంసాలి ఈ బంగారు సెంగోల్‌ని తయారు చేశారు. మొత్తం బంగారంతో తయారు చేసిన ఈ దండంపై నంది బొమ్మను చెక్కారు.