NEET SUPREME COURT:జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష అయిన నీట్-యూజీ (NEET-UG) విధానంలో కీలక మార్పులకు సన్నాహాలు జరుగుతున్నాయి. సుమారు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే ఈ పరీక్షను, ప్రస్తుతం ఉన్న పెన్-అండ్-పేపర్ విధానం నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్షగా మార్చే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అదేవిధంగా, జేఈఈ (JEE) లాగానే, నీట్-యూజీని కూడా మెయిన్, అడ్వాన్స్‌డ్ అనే రెండు దశల్లో నిర్వహించాలని పరిశీలిస్తున్నారు.
ఈ ఏడాది నీట్ పరీక్ష పేపర్ లీక్ అనంతరం దాఖలైన పిటిషన్లపై స్పందిస్తూ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే ఎనిమిది ప్రధాన పరీక్షల్లో ఏడు ఇప్పటికే ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. నీట్-యూజీని సీబీటీ విధానానికి మార్చే అవకాశంపై కూడా చర్చిస్తున్నారు.
తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు – ప్రభుత్వం
జేఈఈ తరహాలో రెండు అంచెల పరీక్షా విధానాన్ని అమలు చేయడం వల్ల పరీక్ష భద్రత పటిష్టమవడమే కాకుండా, విద్యార్థుల సామర్థ్యాలను మరింత మెరుగ్గా అంచనా వేయడానికి కూడా వీలవుతుందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నీట్ పరీక్షలో చర్చిస్తున్న మార్పులను ఖరారు చేసే ముందు ఈ టాస్క్ ఫోర్స్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుంటారు. టాస్క్ ఫోర్స్ నివేదిక అందిన తర్వాతే కొత్త పరీక్షా విధానంపై నిర్ణయం తీసుకుంటారు.
ఈ నిర్ణయం ఒకేసారి అమలు చేయబోం– కేంద్రం
ఆగస్టు 6, శుక్రవారం నాటి విచారణకు ముందు దాఖలు చేసిన ఈ అఫిడవిట్‌లో, పరీక్షా విధానంలో ఎలాంటి పెద్ద మార్పులు హఠాత్తుగా అమలు చేయబోమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. విద్యార్థులకు కొత్త విధానం గురించి చాలా ముందుగానే తెలియజేస్తారు, తద్వారా వారు కొత్త విధానానికి సిద్ధం కావడానికి తగినంత సమయం ఉంటుంది.
ఈ అఫిడవిట్‌లో పరీక్షకు సంబంధించిన భద్రతా చర్యల వివరాలు కూడా ఉన్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీలు. ఇతర అవకతవకలను నివారించడానికి కొత్త చట్టంతోపాటు అనేక సాంకేతిక, పరిపాలనా చర్యలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. వీటిలో ప్రశ్నపత్రాల బయోమెట్రిక్ ధృవీకరణ, జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసే వన్-టైమ్ లాక్ ట్రంకులు, ఎన్‌క్రిప్టెడ్ డిజిటల్ ప్రశ్నల బ్యాంకులు ఉన్నాయి.
నీట్-యూజీ కొత్త పరీక్షా విధానాన్ని ఖరారు చేసే ముందు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, జాతీయ వైద్య కమిషన్‌తో సహా సంబంధిత వర్గాలన్నింటితో విస్తృత సంప్రదింపులు జరుపుతామని ప్రభుత్వం కూడా తెలిపింది.
