చంద్రయాన్ -3 విజయంతో భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశామన్నారు నరేంద్ర మోదీ. ఇస్రో వెళ్లిన ఆయన చంద్రయాన్ -3 టీంను అభినందించారు. చంద్రయాన్-3 దిగిన ప్రదేశానికి శివశక్తిగా నామకరణం చేద్దామని ప్రతిపాదించారు.
బెంగళూరులోని ఇస్రో కమాండ్ సెంటర్‌లో శాస్త్రవేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. చంద్రయాన్-3ని చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ చేసిన ఇస్రో బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సందర్భంగా మూడు కీలక ప్రకటనలు చేశారు. చంద్రయాన్ -3 దిగిన ప్రదేశాన్ని 'శివశక్తి' పాయింట్ అని, చంద్రయాన్ -2 ల్యాండ్ అయిన ప్రదేశాన్ని 'తిరంగా' పాయింట్ అని పిలుద్దామని ప్రకటించారు. ప్రతి ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని సూచించారు.
చంద్రయాన్-3 ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని 'శివశక్తి'గా, చంద్రయాన్-2 ముద్ర ఉన్న ప్రదేశాన్ని తిరంగా పాయింట్ అని పిలుస్తామని ప్రధాని మోదీ తెలిపారు. ఏ వైఫల్యం చివరిది కాదు, కాబట్టి మన చంద్రయాన్ -2 ఫుట్‌ప్రింట్స్ పడి ఉన్న ప్రదేశాన్ని నేటి నుంచి తిరంగా పాయింట్ అని పిలుద్దాం. ఈ తిరంగా పాయింట్ భారత్ చేసే ప్రతి పనికి ప్రేరణగా ఉంటుంది. ఏ అపజయం కూడా చివరిది కాదని ఈ తిరంగా పాయింట్ మనకు బోధిస్తుంది.
విదేశీ పర్యటన ముగించుకుని భారత్ కు తిరిగి వచ్చిన ప్రధాని మోదీ నేరుగా బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. ఆ తర్వాత ఇస్రో క్యాంపస్ కు వెళ్లి శాస్త్రవేత్తలను కలుసుకున్నారు.
మనం చేరుకున్న ప్రదేశానికి ఎవరూ చేరుకోలేదని ప్రధాని మోదీ అన్నారు. గతంలో ఎవరూ చేయని పనిని మనమే చేశాం. ఆగస్టు 23 నా కళ్ల ముందు పదేపదే తిరుగుతోంది. ల్యాండింగ్ కన్ఫార్మ్ కాగానే దేశవ్యాప్తంగా ఇస్రోలో సిబ్బంది సంబరాలు ఎవరు మర్చిపోగలరు. కొన్ని జ్ఞాపకాలు చిరస్మరణీయం అవుతాయి. అని అన్నారు.
"ఒకప్పుడు మనల్ని మూడో స్థాయి దేశంగా లెక్కించేవారు. నేడు వాణిజ్యం నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు భారత్ మొదటి వరుసలో ఉన్న దేశాల జాబితాలో ఒకటిగా నిలిచింది. మూడో వరుస నుంచి మొదటి వరుసకు సాగే ఈ ప్రయాణంలో ఇస్రో వంటి సంస్థలు చాలా పెద్ద పాత్ర పోషించాయి.
కొత్త తరానికి మీరు రోల్ మోడల్, మీ పరిశోధనలు, ఏళ్ల తరబడి చేసిన కృషి, అనుకున్నది చేస్తారని మరోసారి నిరూపించారు అని ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రజలకు మీపై నమ్మకం ఉందని, అలాంటి నమ్మకాన్ని సంపాదించడం చిన్న విషయం కాదన్నారు. దేశ ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ మీపై ఉంటాయన్నారు.