భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం న్యూయార్క్‌లోని ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని 'భారత్ నుంచి నమస్తే' అంటూ రెండు చేతులు జోడించి ప్రారంభించారు. ఐరాస 78వ సాధారణ అసెంబ్లీని ఉద్దేశించి ఆయన 17 నిమిషాలపాటు ప్రసంగించారు. కెనడాతో వివాదం నెలకొన్న నేపథ్యంలో ఐరాస వేదికగా భారత్ తన అభిప్రాయాన్ని గట్టిగా వినిపించింది. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని జైశంకర్ స్పష్టంచేశారు. రాజకీయ అవసరాల కోసం తీవ్రవాదం, ఉగ్రవాదం అణచివేసే బాధ్యతలను విస్మరించకూడదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజకీయ కారణాల వల్ల తీవ్రవాదం, వ్యవస్థీకృత నేరాలను అనుమతించదగినది కాదని ఆయన తెలిపారు. ఇలా జరగడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు.
జైశంకర్ మాట్లాడుతూ..మన ఆకాంక్షలు, లక్ష్యాలు పంచుకునేప్పుడు మన విజయాలు, సవాళ్లను అంచనా వేయడానికి ఇది ఒక సందర్భం. వాస్తవానికి రెండింటికి సంబంధించి భారతదేశం పంచుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని జైశంకర్ వెల్లడించారు. ఆధునికంగా మారుతున్న పురాతన సంప్రదాయ ప్రజాస్వామ్యం నుంచి ఇప్పటి సమాజం కోసం తాను మాట్లాడుతున్నానని అన్నారు. అందుకే ఆలోచన, ఆచరణ, చర్యలు మరింత క్షేత్రస్థాయిలో ఫలితానిచ్చేవిగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సంప్రదాయాలను, సాంకేతికతను మేళవించి భారత్ పనిచేస్తోందని ఆయన గుర్తుచేశారు. ఇదే ప్రస్తుత ఇండియాను నిర్వచిస్తోందని, దటీజ్ భారత్ అని జైశంకర్ ఐరాసలో వెల్లడించారు.
భారత దేశం 'అమృత కాలం'లో ఉందని జైశంకర్ ఈ సందర్భంగా వెల్లడించారు. చంద్రయాన్ 3 విజయం సాధించడం ద్వారా భారత దేశం ఏం చేయగలదో ప్రపంచానికి చాటి చెప్పామని అన్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడం భారత్‌కు ఎంతో గర్వకారణమని తెలిపారు. అలాగే జీ 20 సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించిందని వెల్లడించారు. ఆఫ్రికన్ యూనియన్‌ను జీ20లో చేర్చేందుకు భారత్ కృషి చేసిందని, ఈ స్ఫూర్తితో ఐరాస భద్రతా మండలిని విస్తరించాలని ఆయన కోరారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా భద్రతా మండలిని విస్తరించాలని ఆయన అన్నారు. ఐరాస సమర్థతను పెంచడానికి, ఇంకా విశ్వసనీయతను సాధించడానికి మరింత మంది సభ్యులను చేర్చుకోవడం అవసరమని అన్నారు. ఇతర దేశాల వాణిని వినిపించడం, వారి అభిప్రాయాలను తెలుసుకోవడం ఐరాసకు మరింత బలాన్ని చేకూర్చే అంశమని జైశంకర్ పేర్కొన్నారు.
అప్పుడే అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఇప్పటికి కొన్ని దేశాలే ఎజెండాను నిర్ణయించి అదే అందరిపై రుద్దుతున్నాయని, ఇలా ఎప్పటికీ కొనసాగకూడదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభాకలిగిన దేశంగా భారత్ అవతరించిందని, భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావడానికి భారత్ ఎప్పటినుంచో పోరాడుతోందని అన్నారు. ఇప్పడు ఉన్న ఐరాస భద్రతామండలి 21 శతాబ్దానికి సరిపోదని అన్నారు.
ప్రపంచంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య భారత్ వారధిగా పనిచేస్తోందని, తూర్పు, పశ్చిమ ప్రాంతాలను ఐక్యం చేసేందుకు కృషి చేస్తున్నామని జైశంకర్ వెల్లడించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్లను అధిగమించేందుకు బలమైన దేశాలను ఏకతాటిపైకి తీసుకొస్తామని తెలిపారు. ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అన్న భారత్ నినాదాన్ని ప్రపంచం నమ్ముతోందని భారత్‌ను పరిష్కర్తగా చూస్తోందని తెలిపారు.