Nitin Gadkari Speaks On Ethanol Blending Row: వ్యవసాయంతోపాటు ఇథనాల్ రంగాల్లో తాను చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమర్థించుకున్నారు. తన ప్రయత్నాలు లాభం కోసం కాదని.. అభివృద్ధి కోసమని అన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన అగ్రికోస్ వెల్ఫేర్ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను తాను పొగిడేసుకున్నారు. తన మెదడు కోట్ల విలువైందిగా వ్యాఖ్యానించారు. ‘నా మెదడు నెలకు రూ. 200 కోట్ల విలువైనది. నాకు డబ్బు కొరత లేదు, నేను దిగజారను’ అని అన్నారు. గడ్కరీ ఇథనాల్ విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేశారు.

వ్యవసాయంలో తాను ప్రవేశపెడుతున్న విధానాలు రైతులను శక్తివంతం చేసేందుకేనని నితిన్​ గడ్కరీ అన్నారు. ‘నేను డబ్బు కోసం ఇలా చేస్తున్నానని మీరు అనుకుంటున్నారా? నిజాయితీతో ఎలా సంపాదించాలో నాకు తెలుసు. నేను చక్రాల వ్యాపారిని కాదు’ అని ఆయన అన్నారు. 

విదర్భలో పది వేల మంది రైతుల ఆత్మహత్యలు సిగ్గుచేటురాజకీయ నాయకులు ఎన్నికల్లో లబ్ధి కోసం విభజన సూత్రాలు పాటిస్తారని, ఒక్కోసారి ఇది వెనుకబాటుతనానికి దారితీస్తుందని అన్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని రైతు కష్టాల గురించి తాను తీవ్రంగా కలత చెందానని గడ్కరీ అన్నారు. ‘విదర్భలో పది వేల మంది రైతుల ఆత్మహత్యలు సిగ్గుచేటు. రైతులు సంపన్నులు అయ్యే వరకు మేము నిద్రపోం" అని మంత్రి ఉద్ఘాటించారు.

తన కొడుకు వాణిజ్య సామ్రాజ్యం గురించి ప్రస్తావనతాను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సాధువుగా ఉన్నానన్నారు. తన పని నిజాయతీ, దీర్ఘకాలిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తన కుటుంబం గురించి కూడా ప్రస్తావించారు. వ్యవసాయ వ్యాపారంలో తన కుమారుడు నిఖిల్​ గడ్కరీ చేపడుతున్న వెంచర్ల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. అతడి పాత్ర ఆలోచనలు పంచుకోవడానికి మాత్రమే పరిమితం అని స్పష్టం చేశారు.

నిఖిల్​ గడ్కరీకి అనేక బిజినెస్​లుగడ్కరీ ప్రకారం నిఖిల్​ గడ్కరీ విస్తృత వాణిజ్య నెట్‌వర్క్‌ను నిర్మించారు. గడ్కరీ మాట్లాడుతూ.. ‘ఇరాన్ నుంచి 800 కంటైనర్ ఆపిల్‌లను దిగుమతి చేసుకున్నాడు. భారత్​ నుంచి 1,000 కంటైనర్ అరటిపండ్లను ఎగుమతి చేశాడు. గోవా నుంచి సెర్బియాకు 300 కంటైనర్ చేపలను కూడా తీసుకెళ్లాడు. ఆస్ట్రేలియాలో పాలపొడి యూనిట్‌ను స్థాపించాడు. అబుదాబి, ఇతర ప్రదేశాలకు 150 కంటైనర్లను క్రమం తప్పకుండా సరఫరా చేశాడు’ అని గడ్కరీ చెప్పారు. తన కుమారుడు ఐటీసీ సహకారంతో 26 రైస్ మిల్లులను నడుపుతున్నాడని మంత్రి వెల్లడించారు.