Monkeypox Case India : దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో రెండో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. 35 ఏళ్ల నైజీరియన్ వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్ వచ్చింది. అయితే అతడికి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు. నైజీరియన్ కు మంకీపాక్స్ ఎలా సోకిందో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసుతో దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య 6కు చేరాయి.
దిల్లీలో రెండో కేసు
దిల్లీలో రెండో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. ఇటీవలి విదేశీ ప్రయాణం చేయని 35 ఏళ్ల నైజీరియన్ వ్యక్తిలో మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ గుర్తించారు వైద్యులు. పరీక్షల్లో అతడికి పాజిటివ్ అని తేలింది. దీంతో దిల్లీలో సోమవారం రెండో మంకీపాక్స్ కేసు నమోదైందని PTI నివేదించింది. దేశంలో మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. భారతదేశంలో తొలి మంకీపాక్స్ మరణం సంబంధించింది.
దేశంలో తొలి మరణం
మంకీపాక్స్ సోకిన నైజీరియన్ దిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అతడికి గత ఐదు రోజులుగా శరీరంపై బొబ్బలు, జ్వరం ఉన్నట్లు పీటీఐ నివేదించింది. పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)కి నైజీరియన్ శాంపిల్స్ పంపించారు. ఇందులో అతడికి పాజిటివ్ అని తేలింది. అంతేకాకుండా ఆఫ్రికన్ దేశాలకు చెందిన మరో ఇద్దరు మంకీపాక్స్ వ్యాధితో LNJP ఆసుపత్రిలో చేరారు. జులై 30న కేరళలో 22 ఏళ్ల వ్యక్తి మంకీపాక్స్ తో మరణించాడు. అతడు ఇటీవల యూఏఈ నుంచి తిరిగొచ్చాడు. కేరళలోని త్రిసూర్ జిల్లాలోని పయ్యనూర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడి మరణంపై కేరళ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.
75 దేశాల్లో కేసులు
దేశంలో మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దీనికి నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ నేతృత్వం వహిస్తారు. టాస్క్‌ఫోర్స్ మంకీపాక్స్ వ్యాప్తి, నివారణ కార్యక్రమాలపై నిర్ణయం తీసుకుంటుంది. దేశంలో మంకీపాక్స్ కేసులను నివారించేందుకు అవసరమైన సౌకర్యాల విస్తరణపై ప్రభుత్వానికి టాస్క్ ఫోర్స్ మార్గనిర్దేశం చేస్తుంది. సకాలంలో మంకీపాక్స్ కేసులను గుర్తించడం, కేసుల నిర్వహణ తగిన చర్యలు తీసుకోవడంపై ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. దీనిపై కలిసి పని చేయాలని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌ను కేంద్రం కోరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 75 దేశాలలో 16,000 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.