Devendra Fadnavis On PM Modi: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (Deputy Chief Minister) దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ముచ్చటగా మూడోసారి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. దీపావళి పండగను పురస్కరించుకొని తన నివాసంలో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించి, మూడోసారి మోడీ ప్రధాన మంత్రి పదవి చేపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీని మరోసారి ప్రధానిగా ఎన్నుకోవాలని దేశ ప్రజలంతా ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు. ప్రజల నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. వచ్చేఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. వచ్చే ఏడాది జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాగ్‌పుర్ నుంచి బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు.
డిసెంబర్‌లో నిర్వహించబోయే శీతాకాల సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు రాష్ట్రం నుంచి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మహారాష్ట్ర భవన్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి అక్కడి ప్రభుత్వం భూమి కూడా కేటాయించిందని వెల్లడించారు. నిర్మాణాలు, రవాణా, పారిశ్రామిక వ్యర్థాలను పెద్దమొత్తంలో విడుదల చేయడం వల్లే ముంబైలో వాయుకాలుష్యం పెరిగిపోతోందన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం ఎప్పుడు?
శివసేనలోని రెండు వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు పరస్పరం దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్ల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకునే విషయంలో అసెంబ్లీ స్పీకర్‌కు ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం తుది అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే పై అనర్హత వేటు పడదని అన్నారు. ఒకవేళ పడినా ఎమ్మెల్సీగా ఆయన తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపడతారని తెలిపారు. సీఎం శిందే సహా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసిన స్పీకర్ రాహుల్ నార్వేకర్‌పై సుప్రీం కోర్టు గత నెలలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ల పరిష్కారానికి నిర్ణీత షెడ్యూల్‌ను ఖరారు చేయాలని సెప్టెంబరు 18న ఆదేశించింది. ఈ క్రమంలోనే అక్టోబరు 17న మరోసారి విచారణ చేపట్టింది. తమ ఆదేశాలను స్పీకర్ ధిక్కరించలేరని స్పష్టం చేసింది.