Modi surname case: న్యూఢిల్లీ: ‘మోదీ ఇంటిపేరు’కు సంబంధించిన పరువునష్టం కేసులో తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు బుధవారం తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు తనకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టులో తాజాగా అఫిడవిడ్ దాఖలుచేశారు. తాను నిర్దోషినని, కోర్టు తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని కోరారు. తనపై చేసిన నేరారోపణలు సరైనవి కావని, ఈ విషయంపై క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంటే ఇప్పటికే తాను ఆ పని చేసి ఉండేవాడినని అన్నారు.
ఫిర్యాదుదారు పూర్ణేష్ మోదీకి క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన కారణంగా 'అహంకారి' వంటి పదాలను ఆయన ఉపయోగించారని రాహుల్ గాంధీ తన అఫిడవిట్లో ఆరోపించారు. తాను తప్పు చేయకున్నా క్షమాపణ చెప్పాలని కోరుతున్నారని పేర్కొన్నారు. క్షమాపణ చెప్పలేదని న్యాయ ప్రక్రియకు వెళ్లడం కచ్చితంగా ప్రజాప్రాతినిధ్య చట్టంను దుర్వినియోగం చేయడమే అని రాహుల్ గాంధీ పేర్కొన్నట్లు జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది.
పరువు నష్టం కేసు ఫిర్యాదుదారుడు, బీజేపీ నేత గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ.. ఈ కేసు విషయమై రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకుండా అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్ నేత చేసిన విజ్ఞప్తిని అంగీకారం తెలపవద్దంటూ అందుకు వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. గుజరాత్ హైకోర్టు తనకు విధించిన శిక్షను వాయిదా వేయడానికి నిరాకరిస్తూ జులై 7న తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ రాహుల్ గాంధీ చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు ఆగస్టు 4న విచారణ చేపట్టనుంది.
కర్ణాటకలో నిర్వహించిన ఓ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ కు చెందిన బీజేపీ నేత పూర్ణేశ్ మోదీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ చేపట్టి సూరత్ కోర్టు రాహుల్ కి రెండేళ్ల శిక్ష విధించింది. ఫలితంగా ప్రాతినిధ్య చట్టం కింద ఎంపీ పదవి రాహుల్ గాంధీ కోల్పోవాల్సి వచ్చింది. సూరత్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ సవాల్ చేశారు. తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని సుప్రీంకోర్టులో దాఖలుచేసుకున్న అఫిడవిట్ లో రాహుల్ పేర్కొన్నారు. తనపై విధించిన శిక్షపై ప్రస్తుతానికి స్టే విధించాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ సమావేశాల్లో పాల్గొనేందుకు పర్మిషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.