PM Modi speech at Parliament Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మాట్లాడారు. ఈ సందర్భంగా తన పదేళ్ల పాలనను గుర్తు చేసుకున్నారు. పదేళ్ల పాలనలో దేశంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నామని, రిఫామ్, ట్రాన్స్‌ఫామ్‌లపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ పదేళ్లల్లో ఎన్నో ఆటంకాలు ఎదురైనా అభివృద్ది మాత్రం ఆగలేదని తెలిపారు. కరోనా మహమ్మారి వంటివి అనేక విపత్కర పరిస్థితులు ఎదురైనా అభివృద్దిని మాత్రం కొనసాగించామని, ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు ప్రస్తుత లోక్‌సభ కాలంలో తీసుకున్నామని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు, రామమందిరం నిర్మాణం (Ayodhya Ram Mandir) వంటి అంశాలను మోదీ సభలో ప్రస్తావించారు. జీ 20 సదస్సును ప్రపంచం అబ్బురపడేలా నిర్వహించామని, దీని వల్ల విశ్వ వేదికపై భారత్ ప్రతిష్ట మరింత పెరిగిందని మోదీ స్పష్టం చేశారు. తాను ప్రధానిగా బాధ్యతలు వదిలేసే నాటికి భవిష్యత్ తరాలకు ఆర్ధిక భద్రత కల్పించాలనేది టార్గెట్‌గా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
మరో 25 ఏళ్లల్లో అభివృద్ది చెందిన దేశంగా మారుతామని, ఆ లక్ష్యం దిశగా తమ పాలన కొనసాగుతుందని మోదీ చెప్పారు. వికసిత్ భారత్ పలాలు మన భవిష్యత్ తరాలు అందుతాయని తెలిపారు. మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న క్రమంలో.. 17వ లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు. దీంతో మోదీ తన ప్రసంగంలో తన పాలనలోని అభివృద్ది గురించి వివరించారు. బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియడంతో పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ దన్‌ఖడ్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ.. అధికార, ప్రతిపక్ష సభ్యులను సమానంగా చూశానని, కొన్నిసార్లు సభ గౌరవాన్ని కాపాడేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
17వ లోక్‌సభ విశేషాలు ఇవే..
17వ లోక్‌సభలో అనేక ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి. గత ఐదేళ్లల్లో మొత్తం 222 బిల్లులు ఆమోదం పొందాయి. ప్రస్తుతం లోక్‌సభలో 400 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇక 16వ లోక్‌సభలో 62 మంది మహిళా ఎంపీలు ఉండగా.. 17వ లోక్‌సభకు 78 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న బిజు జనతాదళ్ ఎంపీ చంద్రాడీ ముర్ము 25 ఏళ్ల 11 నెలల వయస్సులో ఎంపీగా గెలిచారు. 17వ లోక్‌సభలో అతి పిన్న వయస్కురాలిగా ఆమె ఉన్నారు. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న ఎంపీలలో 40 ఏళ్లలోపు వారు ఎక్కువమంది ఉన్నారు. ఇక 17వ లోక్‌సభకు జాతీయపార్టీల నుంచి 397 మంది ఎంపీలు ఎన్నికయ్యారు.
ఇక 17వ లోక్‌సభలో తొలిసారి ఎన్నికైనవారు 260 మంది ఉన్నారు. అలాగే 2019లో లోక్‌సభలో 303 మంది సభ్యులతో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 290కి తగ్గినా బీజేపీనే అత్యధిక మెజార్టీతో ఉంది. ఇలా 17వ లోక్‌సభకు ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఇవి చివరి సమావేశాలు కావడంతో అన్ని పార్టీల ఎంపీలతో మోదీ సరదాగా గడిపారు. ఇతర పార్టీల ఎంపీలతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. యువ ఎంపీలతో పార్లమెంట్‌లో ముచ్చటించారు. తన అనుభవాలను సహచర ఎంపీలతో పంచుకున్నారు.