ABP CVoter Mizoram Exit Poll 2023: 


మిజోరం ఎగ్జిట్ పోల్ 


మిజోరం ఎన్నికల ఫలితాలపై ABP CVoter Exit Poll 2023 ఆసక్తికర అంచనాలు వెలువరించింది. మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఈ రాష్ట్రంలో మిజోరం నేషనల్ ఫ్రంట్ (MNF) ప్రస్తుతం అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో ఈ పార్టీ 26 స్థానాలు గెలుచుకుంది. ఈ సారి ఆ సంఖ్య 18కి పడిపోయే అవకాశముందని అంచనా వేసింది ఎగ్జిట్ పోల్. కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకోగా..ఈ సారి కూడా 5 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఇక ZPM (Zoram Peoples Moment) పార్టీ గత ఎన్నికల్లో 8 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఈసారి 15 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయి. ఇతరులు 1-2 స్థానాలు గెలుచుకుంటారని వెల్లడించింది ఏబీపీ సీఓటర్‌ ఎగ్జిట్ పోల్. ఈ ఎన్నికల్లో MNF 15-21 స్థానాల్లో గెలుచుకునే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌కి 2-8 సీట్లు, ZPM 12-18 సీట్లలో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. గత ఎన్నికల్లో MNFకి 37.7% ఓటు శాతం నమోదు కాగా...ఈ సారి అది 32%కి పడిపోనుందని తెలిపింది. కాంగ్రెస్‌కి గత ఎన్నికల్లో 29.9% ఓట్లు దక్కాయి. ఈ సారి అది 24.7%కే పరిమితం కానుంది. ZPM గత ఎన్నికల్లో 22.9% ఓట్లు వచ్చాయి. ఈ సారి అది 28.7%కి పరిమితం కానుంది. ఇక రెండు సినారియోల ఆధారంగా పూర్తి స్థాయి ఫలితాలను అంచనా వేసింది ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్. 


సినారియో -1


ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉంటే MNFకి 13-17 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌కి 4-8,ZPMకి 16-20 సీట్లు వస్తాయని అంచనా వేసింది ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్. 


సినారియో-2 


ప్రభుత్వంపై సానుకూలత ఉంటే MNF దాదాదాపు 22-26 స్థానాలు గెలుచుకుని మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌కి 1-5 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ZPMకి 10-14 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. 


మిజోరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్  విజయం సాధించింది. ప్రజా వ్యతిరేకతతో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఎంఎన్‌ఎఫ్‌కు 26 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఎంఎన్ఎఫ్‌కు 65 శాతం ఓట్లు దక్కాయి. మిజోరంలో మొత్తం 40 శాసనసభ స్థానాలున్నాయి. మెజారిటీ మార్క్ 21. ఎంఎన్ఎఫ్ 26 స్థానాల్లో విజయం సాధించింది.  కాంగ్రెస్‌కు కేవలం 5 స్థానాలు మాత్రమే దక్కాయి. ఇతరులు 8 స్థానాల్లో గెలుపొందారు.


ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించే అంశాలు


సరిహద్దు వివాదాలు, బెంగాల్ నుంచి అక్రమ వలసలు, స్థానిక తెగల మధ్య ఘర్షణలు లాంటి కీలక సమస్యలు ప్రతి సారీ మిజోరం ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. సరైన మౌలిక వసతులు లేకపోవడమూ ఎన్నికల్లో కీలక అంశంగా మారింది. వీటితో పాటు అవినీతి, నిరుద్యోగం లాంటి అంశాలూ ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. మణిపూర్‌లో రెండు తెగల మధ్య జరుగుతున్న ఘర్షణలు మిజోరం ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి. అయితే...మయన్మార్‌ నుంచి వలస వచ్చిన కుకి-జో కమ్యూనిటీకి చెందిన పౌరులకు ఆశ్రయం కల్పిచడం తమకు కలిసొస్తుందని MNF అంచనాలు పెట్టుకుంది. Zo unification అంశాన్ని ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావించింది మిజోరం నేషనల్ ఫ్రంట్.