Messi In Kolkata: షారుఖ్‌ఖాన్ శుక్రవారం రాత్రే కోల్‌కతాలో అడుగుపెట్టారు. ప్రపంచ ఫుట్‌బాల్‌లోనే అత్యుత్తమ ఆటగాడిని కలుసుకుంటానని లోలోపల ఎంతో ఉత్కంఠకు గురయ్యారు. సోషల్ మీడియాలో రెండు రోజుల క్రితమే గోట్‌తో కలిసి సాల్ట్ లేక్ యువభారతి స్టేడియంలో కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రకటించారు. లియోనెల్ మెస్సీ, షారుఖ్‌ను ఒకే వేదికపై చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే, శనివారం అంతా తారుమారైంది. మెస్సీ చుట్టూ జరిగిన రద్దీ కారణంగా అర్జెంటీనా సూపర్ స్టార్ భద్రతపై అనుమానాలు తలెత్తాయి. పరిస్థితి అదుపు తప్పిందని గ్రహించిన వెంటనే మెస్సీని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. దాంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మెస్సీ మైదానంలో ఉన్నంతసేపు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఆయన మెరుపు వేగంతో వెళ్లిపోవడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మెస్సీ చుట్టూ మంత్రులు, అధికారులు, పోలీసుల రద్దీ కారణంగా అతన్ని సరిగ్గా చూడలేకపోయారు. మెస్సీని మైదానం నుంచి తీసుకెళ్తున్నారని చూడగానే ఆ ఆగ్రహం దావానంలా వ్యాపించింది.
ముందుగా నీళ్ల సీసాలు విసరడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆహార పొట్లాలు విసిరారు. కొద్దిసేపటికే, కోపంతో ఊగిపోయిన ప్రజలు కుర్చీలను విరగ్గొట్టి మైదానంలోకి విసిరారు.
షారుఖ్ ఖాన్ మైదానానికి చేరుకున్నారు. ఆయన కారు యువభారతి స్టేడియం ప్రధాన ద్వారం గుండా వీఐపీ జోన్‌లోకి కూడా వచ్చింది. కానీ, శాంతిభద్రతల పరిస్థితి చేయి దాటిపోవడంతో కింగ్ ఖాన్‌ను కారు దిగవద్దని కోరారు పోలీసులు. షారుఖ్ దాదాపు ఇరవై నిమిషాల పాటు కారులోనే వేచి ఉన్నారు. ఆ తర్వాత మైదానం విడిచి వెళ్లారు. షారుఖ్-మెస్సీలను ఒకే వేదికపై చూసే అవకాశాన్ని ప్రేక్షకులు కోల్పోయారు.
మరో వీఐపీ సౌరవ్ గంగూలీ కూడా మైదానానికి వచ్చారు. సౌరవ్ మైదానానికి చేరుకున్నారని మైదానం పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లో ప్రకటించారు. కానీ, పరిస్థితి విషమించడంతో, పెద్ద గందరగోళం మధ్య సౌరవ్ నిశ్శబ్దంగా మైదానం నుంచి బయటకు వెళ్లారు.
గోట్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రావాల్సి ఉంది. ఆమె ఇంటి నుంచి బయలుదేరారు. అయితే, శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడంతో, ముఖ్యమంత్రి తన కారును వెనక్కి తిప్పి వెళ్లిపోయారు. తరువాత, ఆమె సోషల్ మీడియాలో మెస్సీకి క్షమాపణలు చెప్పారు.
మొత్తం మీద, అద్భుతమైన రోజు కోసం బెంగాల్ క్రీడాభిమానులు ఎదురుచూశారు. కానీ దానికి బదులుగా, అవమానం, కళంకం వెంటాడింది. ఇదే బాధతో ఆగ్రహంతో అభిమానులంతా ఇళ్లకు వెళ్లారు. మరి మెస్సీ? అర్జెంటీనా ప్రపంచ కప్ విజేత కోల్‌కతా గురించి ఎలాంటి జ్ఞాపకాలతో తిరిగి వెళ్లారు?