న్యూఢిల్లీ: ‘ఈ సంవత్సరం మన బలగాలు చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' ప్రతి భారతీయుడికి గర్వకారణంగా మారింది. నేటి భారతదేశం తన భద్రత విషయంలో రాజీపడదని ప్రపంచానికి చాటి చెప్పిందని’ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 'మన్ కీ బాత్' 129వ ఎడిషన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, 'ఆపరేషన్ సిందూర్' సందర్భంగా భారత్ పట్ల ప్రేమ, దేశభక్తి, ప్రపంచంలోని ప్రతి మూల నుండి వచ్చాయి. 'వందేమాతరం' 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగానూ ఇదే భావన కనిపించిందని పేర్కొన్నారు.
2025 సంవత్సరం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ అనేక క్షణాలను మనకు అందించిందని ప్రధాని మోదీ అన్నారు. జాతీయ భద్రత నుండి క్రీడా రంగాల వరకు, సైన్స్ ప్రయోగశాలల నుండి ప్రపంచంలోని అతిపెద్ద వేదికల వరకు, భారతదేశం ప్రతిచోటా బలమైన ముద్ర వేసింది. భారతదేశం సైన్స్, అంతరిక్ష రంగాలలో కూడా గొప్ప పురోగతి సాధించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న మొదటి భారతీయుడిగా శుభాన్షు శుక్లా నిలిచారు. పర్యావరణ పరిరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన అనేక కార్యక్రమాలు 2025 లో ప్రారంభమయ్యాయి. భారతదేశంలో చిరుతల సంఖ్య ఇప్పుడు 30 దాటిందని మోదీ తెలిపారు.
మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మహా కుంభమేళా"2025 లో విశ్వాసం, సంస్కృతి, భారతదేశ ప్రత్యేక వారసత్వం అన్నీ మనకు కలిసి వచ్చాయి. సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సంవత్సరం చివరిలో అయోధ్యలోని రామాలయంలో జెండా ఎగురవేత కార్యక్రమం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది" అని ప్రధాని మోదీ అన్నారు.
భారతీయుల కృషితో తయారు చేసిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తూ, స్వదేశీ ఉత్పత్తుల (Make In India) పట్ల ప్రజలు కూడా గొప్ప ఉత్సాహాన్ని చూపించారని అన్నారు. నేడు, 2025 భారతదేశానికి మరింత విశ్వాసాన్ని ఇచ్చిందని మనం గర్వంగా చెప్పవచ్చు అన్నారు.
కన్నడ పాఠశాల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ దుబాయ్‌లో నివసిస్తున్న కన్నడ కుటుంబాలు తమను తాము ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకున్నాయని ఆయన వివరించారు: వారి పిల్లలు టెక్ ప్రపంచంలో అభివృద్ధి చెందుతుండగా, వారు తమ భాష నుండి దూరంగా వెళ్తున్నారా? కన్నడ పాఠశాల పుట్టింది ఇక్కడే, పిల్లలకు కన్నడ చదవడం, నేర్చుకోవడం, రాయడం మరియు మాట్లాడటం నేర్పించే ఒక చొరవ. గీతాంజలి IISc ఇకపై కేవలం తరగతి గది కాదు. ఈ క్యాంపస్ మన సాంస్కృతిక కేంద్రం. ఇది హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, జానపద సంప్రదాయాలు, శాస్త్రీయ రూపాలను కలిగి ఉంది. విద్యార్థులు కలిసి సాధన చేస్తారు. ప్రొఫెసర్లు కూడా విద్యార్థులతో కలిసి కూర్చుంటారు. వారి కుటుంబాలు కూడా జాయిన్ అవుతాయని తెలిపారు.
సమస్యలపై పనిచేసిన మణిపూర్ యువత స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025 ఈ నెలలో ముగిసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ హ్యాకథాన్ సమయంలో, విద్యార్థులు 80 కి పైగా ప్రభుత్వ విభాగాలలో 270 కి పైగా సమస్యలపై పనిచేశారు. 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మణిపూర్ యువకుడు మోయిరంగ్థెమ్ సేథ్ ‘సంకల్పం ఉన్న చోట మార్గం సైతం ఉంటుంది’ అనే విషయాన్ని నిరూపించాడు. మోయిరంగ్థెమ్ నివసించిన మణిపూర్ మారుమూల ప్రాంతం గణనీయమైన విద్యుత్ సమస్యను ఎదుర్కొంది. ఈ సవాలును పరిష్కరించడానికి, అతను స్థానిక పరిష్కారాలను ప్రస్తావించారు. చెప్పినట్లుగానే సౌరశక్తితో తమ సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నాడు.
ఒడిశాకు చెందిన పార్వతి గిరి శతజయంతి ఉత్సవాలను జనవరి 2026లో జరుపుకుంటామని ప్రధాని మోదీ అన్నారు. ఆమె 16 సంవత్సరాల వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం తర్వాత పార్వతి గిరి తన జీవితాన్ని సామాజిక సేవ, గిరిజన సంక్షేమానికి అంకితం చేశారు. ఆమె అనేక అనాథాశ్రమాలను స్థాపించారని మోదీ తెలిపారు. ఆమె స్ఫూర్తిదాయకమైన జీవితం రాబోయే తరాలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుందన్నారు.