Manipur Viral Video: 


తీవ్ర అసహనం..


జమ్ముకశ్మీర్ మాజీ గవర్రన్ సత్యపాల్ మాలిక్ మణిపూర్‌ హింసపై స్పందించారు. తరచూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే ఆయన...ఈ సారి మోదీని టార్గెట్ చేశారు. మణిపూర్‌లో ఓ వీడియో వైరల్ అవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీతో పాటు కేంద్రహోం మంత్రి అమిత్‌షాని లక్ష్యంగా చేసుకుని  ట్విటర్‌ ద్వారా విమర్శలు సంధించారు. ప్రధాని మోదీ అన్ని విషయాల గురించి మాట్లాడేందుకు గంటల కొద్దీ సమయం ఉంటుందని, కానీ మణిపూర్‌పై మాట్లాడటానికి మాత్రం టైమ్ లేదని సెటైర్లు వేశారు. మన్‌ కీ బాత్ పేరు చెప్పుకుని నెలకు కొన్ని గంటల పాటు మాట్లాడుతున్న ప్రధాని మణిపూర్‌ హింస గురించి కేవలం 36 సెకన్లు మాట్లాడటమేంటని ప్రశ్నించారు. 


"ప్రధాని నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్ కార్యక్రమంలో నెలకోసారి గంటల కొద్ది ప్రసంగాలిస్తారు. కానీ మణిపూర్‌ తగలబడిపోతుంటే ఆ అంశం గురించి కేవలం 36 సెకన్లు మాట్లాడి తేల్చేశారు. ఎందుకిలా..? బేటీ బచావో, బేటీ పడావో అని గొప్ప నినాదాలు ఇచ్చిన మీ ప్రభుత్వం హయాంలోనే మహిళలను నగ్నంగా ఊరేగించారు. ఇది కచ్చితంగా ఖండించాల్సిన విషయం"


- సత్యపాల్ మాలిక్, జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్




అంతకు ముందు కూడా సత్యపాల్ మాలిక్ కేంద్రంపై విమర్శలుచేశారు. మహిళల వీడియోలు వైరల్ అవడాన్ని చూసి గుండె మండిపోయిందని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన నేత మణిపూర్‌లో  హింసను ఆపలేకపోయారా అంటూ చురకలు అంటించారు. 


"మణిపూర్‌లో జరిగిన ఘటన అందరికీ సిగ్గుచేటు. ఆ వీడియో చూశాక గుండె మండిపోయింది. రష్యా ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపిన ప్రధాని మణిపూర్‌లో హింసను ఆపలేకపోయారా..? 60 రోజులుగా ఆ రాష్ట్రం తగలబడిపోతోంది. ఈ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ఇవే అల్లర్లు కొనసాగుతాయి"


- సత్యపాల్ మాలిక్, జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్