Six tourists dead, several others feared trapped as massive avalanche hits Nathula in Sikkim: సిక్కింలో విషాదం చోటుచేసుకుంది. నాథులా పర్వత మార్గంలో మంగళవారం సంభవించిన భారీ హిమపాతం విషాదాన్ని నింపింది. భారీ హిమపాతం సంభవించడంతో 350 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వీరిలో కనీసం 6 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, మిగతా వారిలో దాదాపు 25 మందిని రెస్క్యూ టీమ్ కాపాడిందని జాతీయ మీడియా పీటీఐ, ఏఎన్ఐ రిపోర్ట్ చేశాయి.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గ్యాంగ్ టక్ ను నాథులా మార్గాన్ని కలిపే జవహర్ లాల్ నెహ్రూ రోడ్డులో 14వ మైలు వద్ద హిమపాతం సంభవించింది. ఇప్పటిరవకూ 80 వరకు వాహనాలను మంచు నుంచి తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు.
మంగళవారం మధ్యాహ్నం దాదాపు 3 గంటల సమయంలో నాథులా మార్గంలో నెహ్రూ రోడ్డు సమీపంలో హిమపాతం సంభవించింది. ఆ సమయంలో అక్కడ 150 మందికి పైగా పర్యాటకులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి మంచు కింద చిక్కుకున్న కొందరు టూరిస్టులను, వాహనాలను బయటకు తీశారు. మొదట 22 మందిని రెస్క్యూ టీమ్ కాపాడినట్లు అధికారులు తెలిపారు. స్థానికులు సైతం అక్కడికి చేరుకుని పోలీసులు, రెస్క్యూ టీమ్ కు సహాయం చేసి మంచు కింద చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
మార్చి నెల నుంచి సిక్కింలో హిమపాతం సమస్య అధికమవుతోంది. నాథులా మార్గానికి నెహ్రూ రోడ్డు 13వ మైలు, 14వ మైలు వద్ద పర్యాటకులు తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పర్యాటకులను అధికారులు 13వ మైలు వరకు వెళ్లేందుకు మాత్రమే అనుమతించగా, పర్యాటకులు మరింత ముందుకు వెళ్లారని తెలుస్తోంది. ప్రస్తుతం హిమపాతం కారణంగా కొందరు టూరిస్టులు 15వ మైలు వరకు ఎక్కారని సిక్కిం ప్రభుత్వ అధికారులు తెలిపారు.
నాథులా పర్వత మార్గం అనేది ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. సముద్ర మట్టానికి ఇది ఏకంగా 4,310 మీటర్లు (14,140 అడుగులు) ఎత్తులో ఉంటుంది. చైనా సరిహద్దులో ఉండే ఈ టూరిస్ట్ ప్లేస్ కు పర్యాటకులు భారీ సంఖ్యలోనే వెళ్తుంటారు. నాథులా పాస్ అనేది ఇది సిక్కిం, టిబెట్ మధ్య వస్తుంది. ఇది భారత్, చైనా మధ్య సరిహద్దు. చారిత్రాత్మక సిల్క్ రోడ్ వాణిజ్య మార్గంలో భాగమైన నాథులా పాస్, భారతదేశం, చైనా మధ్య ప్రత్యక్ష మార్గం. చైనా , భారతదేశం మధ్య వాణిజ్యం జరిగే నాలుగు పాయింట్లలో నాథు లా ఒకటి కాగా.. చుషుల్ (లడఖ్), నాథు లా, బం లా పాస్ (తవాంగ్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్) , లిపులేఖ్ పాస్ (ఉత్తరాఖండ్).