Maharashtra NCP Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ అధ్యక్ష పగ్గాలను శరద్ పవార్ నుంచి అజిత్ పవార్ లాగేసుకున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) తిరుగుబాటు వర్గం శరద్ పవార్‌ త పార్టీ జాతీయ అధ్యక్షుడు కాదని, అజిత్ పవార్ తమ అధినేత అని పేర్కొంది. ఈ మేరకు ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. పార్టీ పేరుతో పాటు ఎన్నికల గుర్తు తమకు చెందుతాయని ఈసీకి రాసిన లేఖలో అజిత్ పవార్ ప్రస్తావించారు. 35 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని, అజిత్ పవార్ ను ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా గుర్తించాలని ఈసీని కోరారు.


2 దశాబ్దాలకు పైగా శరద్ పవార్ నాయకత్వం.. 
ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్. పార్టీని స్థాపించిన ఆయన రెండు దశాబ్దాలకు పైగా విజయవంతంగా ఎన్సీపీని నడిపించారు. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లోనూ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండి నేతలకు మార్గనిర్దేశం చేశారు. కానీ నేడు అనూహ్యంగా అజిత్ పవార్ వర్గం తమ రాజకీయ కుటిల నీతిని చూపించింది. శరద్ పవార్ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాదని, ఆయనకు ఎమ్మెల్యేలు, నేతల మద్దతు లేదంటూనే అజిత్ పవార్ ను ఎన్సీపీ నేషనల్ చీఫ్ గా పరిగణించాలని తిరుగుబాటు నేతలు ఈసీని కోరారు.


మహారాష్ట్రలో పవార్ వర్సెస్ పవార్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ శిందే ప్రభుత్వంతో చేతులు కలిపారు. అక్కడితో ఆగకుండా తమదే అసలైన NCP అని, ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని అజిత్ పవార్ వర్గం ప్రకటించుకుంది. అక్కడి నుంచి రాజకీయాలు మారిపోయాయి. 53 మంది NCP ఎమ్మెల్యేలలో 40 మంది మద్దతు తమకే ఉందని అజిత్ పవార్ క్లెయిమ్ చేసుకుంటున్నారు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్  ప్రమాణ స్వీకారం చేసిన తరవాత సీన్ మారిపోయింది. గవర్నర్‌కి ఇచ్చిన లేఖలో మాత్రం తనకు 40 మంది కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. సంతకాలు కూడా పెట్టించారు. కానీ...తమకు విషయం ఏంటో చెప్పకుండా  హడావుడిగా సంతకాలు పెట్టించుకున్నారని కొందరు ఎమ్మెల్యేలు మండి పడుతున్నట్టు సమాచారం. అయితే ఇందులో 5 మంది ఎమ్మెల్యేల వరకు తిరిగి శరద్ పవార్ చెంతకు చేరినట్లు తెలుస్తోంది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial