Madhya Pradesh Election Results 2023:
బీజేపీ గ్రాండ్ విక్టరీ..
మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయం (Madhya Pradesh Election Results 2023) సాధించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలు కొంత వరకూ కాంగ్రెస్‌కి పాజిటివ్ వేవ్ ఉందని చెప్పినా ఫలితాలు మాత్రం పూర్తిగా బీజేపీ వైపే మొగ్గు చూపాయి. 230 నియోజకవర్గాలున్న మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకి 116 సీట్లు సాధించాలి. ఈ మేజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ సీట్లే గెలుచుకుంది బీజేపీ. మొత్తం 163 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 66 స్థానాలకే పరిమితమైంది. చాలా చోట్ల కాషాయ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. బీజేపీ కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు. ఈ విజయం తాము ఊహించిందే అని స్పష్టం చేస్తున్నాయి మధ్యప్రదేశ్ బీజేపీ శ్రేణులు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్‌గా ముందుండి నడిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు. బీజేపీపై ఉన్న సానుకూలత ఇక్కడ బాగా పని చేసింది. అందుకే...ఈ సారి ఎప్పుడూ లేనంతగా భారీ మెజార్టీ సాధించగలిగింది కాషాయ పార్టీ. వ్యతిరేతక ఉన్నప్పటికీ...మరీ ప్రభుత్వాన్ని పడగొట్టే స్థాయిలో లేకపోవడం కలిసొచ్చింది. కాంగ్రెస్ ప్రచారమూ పెద్దగా ప్రభావం చూపించలేదు.
ఈ ఫలితాలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. దిగ్విజయ్ సింగ్ కొడుకు జైవర్దన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
"ఈ ఫలితాలు మేం అసలు ఊహించలేదు. బీజేపీ కారణంగా దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగింది. రైతులు, వ్యాపారులు,యువత బీజేపీను వ్యతిరేకిస్తారని భావించాం. గత 15 నెలలుగా కమల్ నాథ్ పార్టీని గెలిపించేందుకు చాలా కష్టపడ్డారు. ప్రజలకు మేం ఎన్నోహామీలిచ్చాం. కానీ అవి ఓటర్లకు సరైన విధంగా చేరుకోలేదు. ఏదేమైనా ఈ తీర్పుని గౌరవించాల్సిందే"
- జైవర్దన్ సింగ్, కాంగ్రెస్ నేత