Red Fort Blasts Conspiracy: ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడు ఘటన తర్వాత, ఈ కుట్ర వివరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు దర్యాప్తు బృందాలు కనుగొన్నాయి. నవంబర్ 10వ తేదీన జరిగిన పేలుడులో 13 మంది చనిపోయారు. గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు. అయితే, 32 వాహనాలను వరుస పేలుళ్ల కోసం సమకూర్చుకోవాలని నిందితులు ప్లాన్ చేసినట్లు దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి. ఈ దర్యాప్తులో వెల్లడైన 8 ముఖ్యాంశాలు ఇవే:
1. బాంబర్ గుర్తింపు ధృవీకరణ
ఎర్రకోట కారు పేలుడుకు పాల్పడిన వ్యక్తి డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని ఫోరెన్సిక్ DNA పరీక్ష ద్వారా ఢిల్లీ పోలీసులు ధృవీకరించారు. అతని తల్లి DNAతో శాంపిల్‌ను పరీక్షించగా, అది సరిపోలింది. పేలుడు సమయంలో అతను కారు స్టీరింగ్ వెనుక ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. దీంతో, ఈ బాంబు పేలుడుకు కారకుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని స్పష్టంగా తేలింది.
2. 32 వాహనాలతో వరుస పేలుళ్లకు కుట్ర
ఎర్రకోట సమీపంలోని బాంబు పేలుడుపై దర్యాప్తు జరుపుతున్న బృందాలకు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. నిందితులు ఇప్పటికే ఒక i20, ఒక EcoSport వాహనాన్ని దాడుల కోసం సిద్ధం చేయడం ప్రారంభించినట్లు సమాచారం. ఆ తర్వాత, పేలుడు పదార్థాలను అమర్చడానికి వీలుగా మరో 32 పాత వాహనాలను సిద్ధం చేయాలని ప్రణాళిక వేసినట్లు తెలిసింది. వీటి ద్వారా దేశంలో పలు కీలక ప్రాంతాల్లో వరుస పేలుళ్లకు పాల్పడాలని కుట్ర చేసినట్లు సమాచారం.
3. EcoSport కారు స్వాధీనం
ఢిల్లీ బ్లాస్ట్‌కు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఎరుపు రంగు ఫోర్డ్ EcoSport కారును దర్యాప్తు బృందాలు ఫరీదాబాద్‌లోని ఖండవాలి జిల్లాలో గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనం డాక్టర్ ఉమర్ ఉన్ నబీ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది.
4. డైరీల రికవరీ
నిందితులు డాక్టర్ ఉమర్, డాక్టర్ ముజమ్మిల్‌ల డైరీలను భద్రతా సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ డైరీలలో తమ పన్నాగాల కోసం కోడ్ భాషలో రాసుకున్నట్లు సమాచారం. దీన్ని భద్రతా నిపుణులు డీకోడ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. నవంబర్ 8వ తేదీ నుంచి 12 వరకు ఈ బ్లాస్ట్ కోసం ప్రణాళిక జరిగినట్లు డైరీలో ఉగ్రవాదులు రాసినట్లు సమాచారం. ఈ డైరీలో దాదాపు 25 మంది పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది జమ్మూ- కాశ్మీర్, ఫరీదాబాద్‌కు చెందిన వ్యక్తులుగా భద్రతా సంస్థలు గుర్తించాయి.
5. ఉగ్ర బృందాలు జంటగా దాడులకు కుట్ర
ఉగ్రవాద బృందాలు జంటగా (రెండు గ్రూపులుగా) వెళ్లి బాంబు దాడులకు పాల్పడాలని ప్రణాళిక చేసినట్లు వెల్లడైంది. ఒక్కో బృందం తమతోపాటు అనేక ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లను (IEDs) తీసుకొని నాలుగు వేర్వేరు నగరాలలో ఏకకాలంలో దాడులు చేయాలని ప్రణాళిక వేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు భద్రతా సంస్థలు చెబుతున్నాయి.
6. నిధుల సేకరణ విషయాలు వెల్లడి
ఉగ్రవాదుల కుట్ర అమలు కోసం చేసే ఖర్చుల నిమిత్తం ఉమర్ నబీకి దాదాపు ₹20 లక్షల నగదు సమకూర్చినట్లు సమాచారం. ఈ నిధులను ఉపయోగించి, IEDల తయారీకి అవసరమైన 20 క్వింటాళ్లకుపైగా NPK ఎరువును (పేలుడు పదార్థాల తయారీ ముడి సరుకు) సుమారు ₹3 లక్షలకు కొనుగోలు చేసినట్లు దర్యాప్తు బృందాలు కనుగొన్నాయి.
7. కమ్యూనికేషన్ కోసం సిగ్నల్ యాప్
తమ ఉగ్ర కార్యకలాపాల కోసం ఉమర్ ఇద్దరు నుంచి నలుగురు సభ్యులతో 'సిగ్నల్' యాప్ గ్రూప్‌ను కూడా సృష్టించినట్లు దర్యాప్తు బృందాలు కనుగొన్నాయి. దీని ద్వారా సురక్షితంగా ఒకరికొకరు కమ్యూనికేషన్ చేసుకునేందుకు దీన్ని వాడినట్లు తెలుస్తోంది.
8. ఉగ్రవాద సంస్థతో సంబంధాలు
వైద్యుడైన ముజమ్మిల్ 2021-2022 మధ్య కాలంలో 'అన్సార్ గజ్వత్-ఉల్-హింద్' అనే సంస్థతో సంబంధాలు కలిగినట్లు వెల్లడైంది. ఇది ఐసీస్ సంస్థ విభాగమే. తాను సొంతంగా ఉగ్రవాద సంస్థ ఏర్పాటు చేయడానికి 2023, 2024లోనే ఆయుధాలు సేకరించినట్లు భద్రతా సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది.