Karnataka News: రోడ్డుపై నిర్లక్ష్యంగా వాహనం నడపకూడదు.. పరిమితికి మించి వేగంగా వెళ్లకూడదు.. జనసమ్మర్థ ప్రాంతాల్లో ఆచితూచి వాహనం డ్రైవ్ చేయాలి.. ట్రాఫిక్ సిగ్నళ్లు పాటించాలి.. కూడళ్ల వద్ద నెమ్మదిగా వెళ్లాలి.. ఇలాంటి సూచనలను ట్రాఫిక్ పోలీసులు ఇస్తూనే ఉంటారు. కానీ చాలా మంది వాటిని పాటించరు. నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రమాదం జరుగుతుంటాయి. మనం రోడ్డుపై అన్ని నిబంధనలు పాటిస్తూ.. హెల్మెట్ ధరించి, సీట్ బెల్ట్ పెట్టుకుని, నిదానంగా, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వెళ్తున్నా.. ఎదురుగా వచ్చే వారి నిర్లక్ష్యపూరిత ధోరణి వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. రోడ్డు ప్రమాదాలు జరగడం చాలా సార్లు వినే ఉంటాం. కానీ మనకు జరిగినప్పుడు దాని బాధ, ఆవేదన, ఆక్రోషణ అర్థం అవుతుంది. కొన్ని ఘటనల్లో అభంశుభం తెలియని వాళ్లు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. రోడ్డుకు ఎడమ పక్కన నడుచుకుంటూ వెళ్తున్న సమయంలోనూ ఎవరో చేసిన తప్పు వల్ల మనం ప్రాణాపాయ స్థితిలో పడిపోతాం. కొన్నిసార్లు జీవితాంతం అవిటి వాళ్లమవుతాం. అలాంటి ఘోర రోడ్డు ప్రమాదం తాజాగా కర్ణాటకలో జరిగింది. ఎవరో వేగంగా వస్తున్నారు, మరెవరో నిర్లక్ష్యంగా చేసిన పనికి.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






కర్ణాటక రాయచూర్ లో రైల్వే స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద తాజాగా రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు డీకొట్టడం వల్ల ఒక అమ్మాయి గాలిలో ఎగిరి 15 అడుగులు దూరంలో పడిపోయింది. మరో ఇద్దరి విద్యార్థినులు కూడా చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అవి కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ దృశ్యాల్లో ఏముందంటే..






అంబేద్కర్ సర్కిల్ రోడ్డులో ఓ కారు వేగంగా దూసుకువస్తుంది. ఆ ప్రాంతంలో అంత వేగంతో వెళ్లడం అంటే పరిమితికి మించి వెళ్లడమే. అంబేద్కర్ సర్కిల్ వద్దకు రాగానే అవతలి రోడ్డు నుంచి కారు ప్రయాణిస్తున్న మార్గంలోకి ఓ బైకర్ సడెన్ గా యూ-టర్న్ తీసుకున్నాడు. దీంతో వేగంగా దూసుకొస్తున్న కారును డ్రైవర్ నియంత్రించలేకపోయాడు. దీంతో ఆ బైక్ తో పాటు.. అదే మార్గంలో రోడ్డుకు ఎడమ వైపు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న నలుగురు విద్యార్థినులపై ఆ కారు దూసుకొచ్చింది.  నలుగురు విద్యార్థినుల్లో ఒక అమ్మాయిని బలంగా ఢీకొట్టడంతో.. ఆమె గాలిలో ఎగిరి 15 అడుగులు దూరంలో పడిపోయింది. మిగతా వారు కొన్ని అడుగుల దూరంలో చెల్లాచెదురుగా పడిపోయారు. 


ఈ ప్రమాదంలో ఒక విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. మరో ముగ్గురు విద్యార్థినులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో నిర్లక్ష్యపూరితంగా డ్రైవింగ్ చేసిన బైకర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ద్విచక్రవాహనదారుడు రాయచూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెనస్ (రిమ్స్)లో చికిత్స పొందుతున్నాడు. ఈ రోడ్డు ప్రమాదంపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నాటక ట్రాఫిక్ & రోడ్డు సేఫ్టీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అలోక్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అతివేగంగా వస్తున్న కారు డ్రైవర్ తో పాటు.. నిర్లక్ష్యపూరితంగా డ్రైవింగ్ చేయడం, ప్రమాదానికి కారణమైన బైకర్ పై కేసు నమోదు చేసిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇద్దరు వ్యక్తుల డ్రైవింగ్ లెసెన్స్ ను సస్పెండ్ చేయాలని ఆదేశించినట్లు చెప్పుకొచ్చారు.